ఏటూరు నాగరంలో డిసెంబర్ 1న జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని పౌర హక్కుల సంఘం తరపు న్యాయవాది వాదించారు. భోజనంలో మత్తుపదార్ధాలు కలిపి వారిని కస్టడీలోకి తీసుకున్నారని న్యాయవాది అన్నారు. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి మావోస్టులకు కాల్చి చంపారని.. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆయన హైకోర్టులో వాదించారు. మావోయిస్టుల మృతదేహాలపై గాయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు చూపించకుండానే పోస్ట్ మార్టం చేశారని పౌరహక్కుల సంఘం న్యాయవాది చెప్పారు.
ప్రభుత్వ న్యాయవాది వాదనలు
అడవిలో పోలీసుల భద్రత దృష్ట్యా మావోయిస్టుల మృతదేహాలను ములుగు మెడికల్ హాస్పిటల్ కు తరలించామన్నారు ప్రభుత్వ న్యాయవాది. అక్కడి నుంచి తీసుకెళ్లి కాకతీయ మెడికల్ కాలేజీలో పోస్ట్ మార్టం నిర్వహించామని తెలిపారు.
ఎన్ కౌంటర్ పై తదుపరి విచారణ డిసెంబర్ 3కి వాయిదా వేశారు. పోస్ట్ మార్టం ప్రక్రియను వీడియో రికార్డ్ చేశారని ఆయన వివరించారు. వాదనలు విన్న తర్వాత మృతదేహాలను మంగళవారం (డిసెంబర్ 3) వరకు భద్రపరచాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు చూపించాలని కోర్టు పోలీసులకు ఆదేశించింది.