/rtv/media/media_files/2025/12/22/fotojet-3-2025-12-22-20-53-10.jpg)
Burgula Rama Krishna Rao (BRK) Bhavan
Telangana Govt Orders : నిధుల లేమితో బాధపడుతున్న తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానాపై అద్దె భారాన్ని తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31లోగా ప్రైవేటు భవనాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఖాళీ చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కార్యాలయాలు ఆ రాష్ర్టానికి తరలిపోవడంతో హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చిన బీఆర్కే భవన్, గగన్ విహార్ వంటి భవనాల్లోకి వీటిని మార్చాలని నిర్ణయించారు. జనవరి 1 నుంచి ఈ ఆఫీసులు తప్పనిసరిగా సొంత భవనాల్లోనే పనిచేయాలని ఆదేశించారు. ఒకవేళ ఆ లోపు మార్చకుంటే ఫిబ్రవరి 1 నుంచి అద్దె చెల్లింపులు నిలిపివేస్తామని.. దీనికి అధికారులే వ్యక్తిగత బాధ్యత వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించే దిశగా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ కార్యాలయం కూడా ప్రైవేటు అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయిస్తూ.. కొత్త ఏడాది నుంచి పరిపాలన అంతా సొంత భవనాల్లోనే సాగాలని ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం కేవలం ఆదేశాలకే పరిమితం కాకుండా.. కఠినమైన ఆర్థిక నిబంధనలను కూడా విధించింది. డిసెంబర్ 31 లోపు ప్రైవేటు భవనాలను ఖాళీ చేసి.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లోకి మారాలని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులను నిలిపివేయాలని ట్రెజరీ విభాగానికి సర్క్యులర్ కూడా జారీ చేసింది. గడువు దాటిన తర్వాత కూడా అద్దె భవనాల్లోనే కొనసాగితే... ఆ అద్దెను సంబంధిత శాఖాధికారి తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అందుబాటులో పలు భవనాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వానికి భారీగా భవనాలు అందుబాటులోకి వచ్చాయి. గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ తన కార్యాలయాలన్నింటినీ అమరావతి, విజయవాడకు తరలించింది.దీంతో రాజధానిలో కీలకమైన భవనాలు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం పరిశ్రమ భవన్, గగన్ విహార్ కాంప్లెక్స్, బీఆర్కే భవన్ , ఎర్రమ్ మంజిల్ వంటి ప్రతిష్టాత్మక భవనాల్లో స్థలం ఖాళీగా ఉంది. అందుకే అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను ఆయా కార్యాలయాల్లో్కి మార్చాలని ఆదేశించింది. ప్రభుత్వ విభాగాలే కాకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు కూడా ఈ నిబంధనను పాటించాలని స్పష్టం చేసింది.
ప్రతి ఏటా ప్రభుత్వం అద్దె రూపంలో కోట్లాది రూపాయలను ప్రైవేటు భవన యజమానులకు చెల్లిస్తోంది. అయితే సొంత భవనాలు ఖాళీగా ఉండగా.. అద్దె భవనాల కోసం ప్రజా ధనాన్ని వెచ్చించడం సరికాదని ప్రభుత్వం భావిస్తోంది అన్ని కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోకి మారడం వల్ల ప్రజలకు కూడా ఒకే ప్రాంగణంలో వివిధ సేవలందే అవకాశం ఉంటుంది. జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ ఒక్క ప్రభుత్వ బోర్డు కూడా ప్రైవేటు భవనంపై కనిపించకూడదన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనపడుతోంది.
Follow Us