కేసీఆర్ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? అసలు ఆయనకు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా?

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంది? ఆయన అకస్మాత్తుగా ఎందుకు ఆస్పత్రిలో చేరారు? ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్యలు ఏంటి? అన్న అంశంపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ సాగుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
KCR Health Issues Details

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న సడెన్ గా హాస్పటల్ లో అడ్మిట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆయనకు ఏమైంది? ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? అన్న చర్చ జోరుగా సాగుతోంది. కుమారుడు కేటీఆర్, కూతురు కవితతో పాటు ముఖ్య కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి చేరుకుని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్న వార్తలతో బీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కేసీఆర్ ఆస్పత్రిలో చేరిన కొన్ని గంటల్లోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన ఆరోగ్య వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లతో మాట్లాడి కేసీఆర్ కు ఉత్తమ చికిత్స అందించాలని కోరారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ సీఎంకు అత్యున్నత, మెరుగైన చికిత్స అందించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కోరారు. అమ్మవారి ఆశీర్వాదంతో కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

కేసీఆర్ కు ఏమైంది?

కేసీఆర్ ఆరోగ్యంపై నిన్న యశోద ఆస్పత్రి యాజమాన్యం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వీక్ నెస్ కారణంగా నిన్న ఆయన ఆస్పత్రిలో చేరినట్లు బులిటెన్ లో పేర్కొంది. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా.. అధిక స్థాయిలో షుగర్.. తక్కువ స్థాయిలో సోడియం ఉన్నట్లు తేలిందన్నారు. మిగతా అన్ని పరీక్షల్లో ఫలితాలు నార్మల్ గా ఉన్నట్లు వచ్చాయన్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంతో పాటు సోడియం లెవెల్స్ ను పెంచేందుకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. 


స్పందించిన బీఆర్ఎస్

కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ.. బీఆర్ఎస్ ఈ అంశంపై స్పందించింది. రెగ్యులర్‌గా జరిగే ఆరోగ్య పరీక్షల కోసం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గురువారం సాయంత్రం యశోద దవాఖానకు వచ్చినట్లు బీఆర్ఎస్ తెలిపింది. వైద్యుల బృందం ఆయనను పరీక్షించగా.. ఆయన ఆరోగ్యం బాగుందని తేలినట్లు వెల్లడించింది. ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం రెండు, మూడు రోజులపాటు ఆస్పత్రిలోనే ఉంటే బాగుంటుందని వైద్యులు కేసీఆర్ కు సూచించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రకటనలో పేర్కొంది. 

ఇటీవల ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు..

కేసీఆర్ సాధారణంగా యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉంటారు. డాక్టర్ ఎంవీ రావు కేసీఆర్ కు వ్యక్తిగత వైద్యుడిగా చాలా రోజుల నుంచి సేవలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆధ్వర్యంలోనే కేసీఆర్ అనేక సార్లు వైద్య పరీక్షలు చేయించుకుని.. చికిత్స తీసుకుంటూ ఉంటారు. అయితే.. గత జూన్లో ఆయన ఏఐజీ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆ ఆస్పత్రి చీఫ్‌ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు పరీక్షలు జరిగాయి. రెండు రోజుల పాటు ఆయనను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపినట్లు వార్తలు వచ్చాయి. పలు సూచనలు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఇది జరిగి మూడు వారాలు కూడా కాకముందే కేసీఆర్ నిన్న యశోద ఆస్పత్రిలో అనారోగ్య సమస్యలతో చేరారు. 


20 ఏళ్ల నుంచి షుగర్?

దాదాపు 20 ఏళ్ల నుంచి కేసీఆర్ షుగర్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల సూచనలు పాటించడం.. క్రమం తప్పకుండా మెడిసిన్ వేసుకోవడంతో ఆయన షుగర్ ఎప్పుడూ కంట్రోల్ లోనే ఉంటుందని సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎప్పుడూ ఆస్పత్రి బారిన పడడం.. తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భాలు లేవని వారు గుర్తు చేసుకుంటున్నారు. ఆయనకు ఇమ్యూనిటీ కూడా బాగుటుందని.. ఈ నేపథ్యంలోనే కరోనా సోకినా కేసీఆర్ కు పెద్దగా ఇబ్బంది కాలేదని వారు చెబుతున్నారు. 

2023 డిసెంబర్లో కాలు విరగడంతో ఆపరేషన్..

2023 ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే కేసీఆర్ పామ్ హౌస్ లో కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనకు యశోద వైద్యులు తుంటి మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే కేసీఆర్ మళ్లీ నడిచారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. రెండు సార్లు అసెంబ్లీకి కూడా వచ్చారు. అయితే.. కాలు విరిగిన దగ్గరి నుంచే కేసీఆర్ కు ఆరోగ్య సమస్యలు పెరిగాయన్న చర్చ కూడా ఉంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు