Revanth Reddy: కొడంగల్‌లో అసలేం జరుగుతోంది.. ఫార్మాసిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం లగచర్లలో ఫార్మా సిటీని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారి ఆందోళనకు కారణం ఏంటి? ప్రభుత్వ వాదన ఏంటి? పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి

New Update
Pharma City

సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో నిన్న కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడితో తెలంగాణ ఉలిక్కిపడింది. ఏకంగా కలెక్టర్ పైనే దాడి జరగడంతో ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్ గా తీసుకుంది. ఈ దాడిలో పాల్గొన్న వారు ఎవరు? వారి వెనుక ఎవరు ఉన్నారు? అన్న కోణంలో ఇప్పటికే పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. ఈ దాడి వెనుక బీఆర్ఎస్ అగ్ర నేతలు ఉన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అసలు లగచర్లలో ఫార్మాసిటీని పెట్టాలని ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంది? ఇందుకోసం ఎన్ని ఎకరాలను సేకరిస్తున్నారు? రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అన్న అంశం తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశమైంది.

ఇది కూడా చదవండి: కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం.. ఎమ్మెల్యే పదవి కూడా పోతుందా?

గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు నిర్ణయం..

కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తం 20 వేల ఎకరాల్లో భారీ ఎత్తున ఈ ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలని భావించారు. అయితే.. గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్.. ఆ ప్రాజెక్ట్ ను రద్దు చేసింది. భూ సేకరణలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు కాలుష్యంతో ఇబ్బంది పడతామంటూ స్థానిక రైతులు ఆందోళనలు చేయడమే ఇందుకు కారణం. అనంతరం సమీకృత గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్ల ప్రాజెక్టును తీసుకువస్తామని రేవంత్ సర్కార్ ప్రకటించింది. జనవరిలో జరిగిన బయో ఏసియా అంతర్జాతీయ సదస్సులో ఇందుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను సీఎం ప్రకటించారు. రాజధాని హైదరాబాద్ కు సమీపంలోని వికారాబాద్, మెదక్, నల్లగొండ జిల్లాలను ఈ గ్రీన్‌ ఫీల్డ్‌ ఫార్మా క్లస్టర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ఎంపిక చేసింది. ఒక్కో క్లస్టర్లలో మూడు నుంచి నాలుగు గ్రామాలు ఉండనున్నాయి. 

ఇది కూడా చదవండి: KTR: కేటీఆర్‌ ఢిల్లీ టూర్‌పై బీజేపీ మౌనం.. కారణమేంటి?

ఆగస్టులో భూ సేకరణకు అడుగులు..

ఆగస్టులో ఇందుకు సంబంధించిన భూ సేకరణకు ప్రభుత్వం అడుగులు వేసింది. సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి సేకరణను ప్రారంభించింది. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల్లో 1,373 ఎకరాలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 700 ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇందుకు సంబంధించి అధికారులు ఆయా గ్రామాల రైతులతో చర్చలు జరపిందుకు అప్పటి నుంచి ప్రయత్నిస్తున్నారు. కానీ రైతులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10 లక్షల వరకు పరిహారం, ఇంటి స్థలం, ఇంటకో ఉద్యోగం ఇస్తామని చెబుతోంది. ఈ ప్రాంతంలో మొత్తం పది వేల ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు ఈ రోజు నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలిపారు. 

Also Read : AP Agriculture Budget 2024: రూ. 43,402 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్

భూమి పోతే బతికేదెట్లా..

కానీ రైతులు మాత్రం ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగారం లాంటి తమ భూములకు అంత తక్కువ పరిహారం ఇస్తారా? అని ఫైర్ అవుతున్నారు. తమకు వ్యవసాయం తప్పా మరొకటి తెలియదని.. ఇప్పుడు తమ భూములను ఫార్మాసిటీకి ఇస్తే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 25న కూడా ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు ప్రయత్నించగా.. బాధిత రైతులు అడ్డుకున్నారు. ఆ సమయంలో రోటిబండ తండాలో కాంగ్రెస్ పార్టీ దుద్యాల మండల అధ్యక్షుడు అవిటి శేఖర్‌పై దాడి జరిగింది. పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. హకీంపేటలో కొందరు రైతులు సెప్టెంబరు నుంచి నిరాహార దీక్షలు చేసి తమ నిరసనను తెలుపుతున్నారు. వివిధ రూపాల్లో తమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న రైతుల అభిప్రాయాలు సేకరించడానికి వచ్చిన కలెక్టర్లతో పాటు అధికారులపై దాడి జరిగింది. 

Also Read :  మేనకోడలిని పెళ్లి చేసుకోబోతున్న 46ఏళ్ల హీరో! ఎవరో తెలుసా?

ప్రభుత్వం నెక్ట్స్ స్టెప్ ఏంటి?

నిన్న అధికారులపై దాడి జరగడంతో ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఈ రోజు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐజీ సత్యనారాయణ, ఎస్పీ నారాయణ రెడ్డితో సమావేశం అయ్యారు. వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన సెక్యూరిటీ లేకుండా కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు ఎవరు అడ్డుపడినా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి వెనక్కు తగ్గే అవకాశం మాత్రం కనిపించడం లేదని తెలుస్తోంది. అవసరం అయితే.. ఆయనే రైతుల ప్రతినిధులతో చర్చించి పరిహారం పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. మీకు ఎలాంటి ఇబ్బంది రాదని భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంది.  

Advertisment
Advertisment
తాజా కథనాలు