/rtv/media/media_files/2025/10/30/tg-2025-10-30-05-57-31.jpg)
మొంథా తుఫాను..తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. గత రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ ను ముంచేసింది. ఇప్పుడు తెలంగాణపై విరుచుకుపడుతోంది. ఏపీలో కోస్తా, తూర్పు ఆంధ్రాలు భారీ వర్షాల ధాటికి మునిగిపోయాయి. అక్కడి వాగులు, వంకలూ పొంగి పొర్లుతున్నాయి. ఈ తుఫాను మంగళవారం రాత్రికి కోస్తాంధ్ర నుంచి ఛత్తీస్‌గఢ్, ఒడిశాలవైపు వెళ్తుందని భావించారు. కానీ అది కాస్తా దిశ మార్చుకుని ఉత్తరాంధ్ర, తెలంగాణ సరిహద్దుల మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేస్తోంది.
తెలంగాణ సైతం అతలాకుతలం..
దీంతో మంగళవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు కూడా భారీ వర్షాలు పడుతూనే ఉన్నాయి. వాగులు, ఊళ్ళూ ఒక్కటయ్యాయి. రహదారులు కొట్టుకుపోయాయి. ఈదురు గాలులకు ఇళ్ళు, చెట్లు కూలిపోయాయి. హనుమకొండ, వరంగల్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాలు భారీ వర్షాలతో వణికిపోయాయి. అయితే బుధవారం సాయంత్రానికి తుఫాను కాస్తా వాయుగుండంగా మారింది. కానీ ఈరోజు కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. అందుకే చాలా చోట్ల స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు కూడా ఇచ్చేశారు. ములుగు, జనగామ, వరంగల్, కరీంనగర్, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లిల్లో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక భారీ వర్షాల ధాటికి వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. రైళ్లు నిలిచిపోయాయి. పలు రైళ్ళను దారి మళ్లించారు. బస్సుల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. డిండి వాగు పొంగవి ప్రవహించడంతో శ్రీశైలం హైవే కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ నుంచి శ్రీశైలం దారిలో వాహనాలను మళ్లించారు.
ఈరోజు విద్యాసంస్థలకు సెలవు..
భారీ వర్షాలతో 16 జిల్లాలకు వరద ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ తెలిపింది. గోదావరి పరీవాహకంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి జిల్లాల్లో వాగులు, వంకల్లో ప్రవాహ బాగా పెరిగిపోయింది. ప్రాజెక్టులు, చెరువులకు వరద పోటెత్తి వాటి దిగువ ప్రాంతాల్లో ముంపు ప్రమాదం పొంచి ఉంది. నిన్న , ఈరోజు తెలంగాణలో ఆరు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడనున్నాయి.
Also Read: BIG BREAKING: తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు!
Follow Us