కాళేశ్వరం నిర్మాణంలో ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ కు (World Biggest Scam in Kaleshwaram by MEIL) పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ లో అవకతవకలపై విచారణ చేసిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వంతో పాటు, మేఘా ఇంజినీరింగ్ సంస్థ, బీహెచ్ఈఎల్ కు నోటీసులు జారీ చేసింది. ప్రాజెక్టుకు సంబంధించి ఒరిజినల్ ఫైల్స్ ను తమ ముందు ఉంచాలని నోటీసుల్లో పేర్కొంది. బీహెచ్ఈఎల్ తాను తయారు చేసి సప్లై చేసిన పరికరాలు, పొందిన బిల్లులకు సంబంధించిన వివరాలతో అఫిడావిట్ ను కూడా అందించాలని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. మేఘా కోసమే అంచనాల పెంపు.. నాగం జనార్దన్ రెడ్డి తరఫున ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపిస్తూ.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు మొదటగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా రూ.5,960తో అంచనాలు తయారు చేసిందన్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారుడిని తీసుకువచ్చిందని న్యాయస్థానానికి వివరించారు. ప్రభుత్వం కావాలనే మూడు రోజుల్లోనే రూ.8,386 కోట్లతో మరో అంచనా రూపొందేలా చేసిందని ఆయన వివరించారు. అ అంచనాలను నిబంధనలకు విరుద్దంగా సవరించారన్నారు. సరైన విధానాలను అనుసరించకుండా చేసిన ఈ సవరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ. 2,426.07 కోట్ల భారీ నష్టం వాటిల్లిందన్నారు. పరికరాల అంచనాలకు సంబంధించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కోటేషన్లు కోరాల్సిన అవసరం ఉందన్నారు. MEIL, BHEL మధ్య ఒప్పందంలోనూ లోపాలు ఉన్నాయన్నారు. ఆ రెండు సంస్థలు చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం.. 65% ఎలక్ట్రికల్-మెకానికల్ పనులు నిర్వహించే BHELకు 20% మొత్తం, మిగతా 35% సివిల్ పనులు నిర్వహించే మేఘా సంస్థకు 80% సొమ్మును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారని నాగం తరఫు లాయర్ వాదనలు వినిపించారు. BHEL సంస్థ పరికరాలను మాత్రమే సరఫరా చేస్తుందని.. ఆ పరికరాల ఏర్పాటుతో పాటు మెయింటెనెన్స్ పూర్తిగా మేఘా సంస్థే చూసుకుంటుందని వాదనలు వినిపించడంతో ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిందన్నారు. ప్యాకేజీ 5కు సంబంధించి 9 మోటార్లు, పంపుల ధర రూ.1,611 కోట్లుగా ఉందన్నారు. అయితే BHEL సంస్థ ఇంతగా ఖర్చు చేస్తున్నా వారికి కాంట్రాక్టు కింద రూ.803 కోట్లు మాత్రమే ఎందుకు నిర్దేశించారనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మోటార్లు, పంపుల ధరలను 4 నుంచి 5 రెట్లు పెంచినట్లు కాగ్ చెప్పిందని తెలిపారు. ఇక్కడ కూడా అదే ప్రాసెస్ ను ఫాలో అయ్యారని ఆయన పేర్కొన్నారు. BHEL సప్లై చేసే మోటార్లు, పంపుల ఖర్చు 65 శాతం ఉన్నా.. వారికి 20 శాతం మొత్తం ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం విచిత్రంగా లేదా? అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్‌ఖన్నా వ్యాఖ్యానించారు. 8 మోటార్లు, పంపుల్లో BHEL అందించే పరికారాల వాట ఎంత? అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఆ వివరాలు చెప్పడానికి మేఘా, బీహెచ్ఈఎల్ ప్రతినిధులు సమయం తీసుకున్నారు. దీంతో అన్ని ఒరిజినల్ ఫైల్స్ ను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు మేఘా, BHELను ఆదేశించింది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వయిదా వేసింది. 2017లో పిటిషన్.. నాగం జనార్దన్ రెడ్డి 2017లో తాను బీజేపీలో ఉన్న సమయంలో హైకోర్టులో ఈ విషయానికి సంబంధించి పిల్ దాఖలు చేశారు. BHEL, MEIL మధ్య సంయుక్త ఒప్పందానికి కాంట్రాక్ట్ కేటాయింపు చేయడాన్ని ఆయన సవాల్ చేశారు. ఈ కాంట్రాక్ట్ కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 2000 కోట్లకు పైగా నష్టం కలిగిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రాజెక్టులో ఉపయోగించే పరికరాల విలువను మోసపూరితంగా రూ. 5,960 కోట్ల నుంచి రూ. 8,386 కోట్లకు పెంచారన్నారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరారు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.