/rtv/media/media_files/2024/10/22/YnbP6Gz876OArgI9SEYa.jpg)
Super kick for the Excise Department
Alcohol Sales: రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ మరోసారి తన సత్తా చాటింది. ఒక్కనెలలోనే పెద్దమొత్తంలో ఆదాయం సమకూర్చుకుంది. ఒకటికాదు రెండు కాదు ఏకంగా రూ.6,348 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త మద్యం పాలసీలో భాగంగా అందిన దరఖాస్తుల ఫీజులు, లైసెన్స్ ఫీజుల రూపంలో ఏకంగా రూ.3,180 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. మరోవైపు అక్టోబరు నెలలో వరుస పండుగలు రావడంతో మద్యం అమ్మకాలు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో రికార్డు స్థాయిలో రూ.3,168 కోట్ల ఆదాయం సమకూరింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా రెట్టింపు స్థాయిలో ఆదాయం రావడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్రంలోని 2,620 మద్యం దుకాణాలకు రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో కొత్త లైసెన్సులు ఇచ్చేందుకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. అదే సమయంలో కొత్త పాలసీలో భాగంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజును రూ.2లక్షల నుంచి రూ.3లక్షలకు పెంచింది. రెండేళ్ల క్రితం 1.32లక్షల మంది దరఖాస్తు చేయగా.. రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి దరఖాస్తు ఫీజు పెంచినప్పటికీ మద్యం దుకాణాలను దక్కించుకోవడానికి 95,628 మంది పోటీపడ్డారు. ఫలితంగా కేవలం దరఖాస్తుల విక్రయం ద్వారానే ఎక్సైజ్ శాఖకు రూ.2,868.8 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. లాటరీలో మద్యం షాపులను దక్కించుకున్న వ్యాపారులు మొదటి విడతలో లైసెన్స్ ఫీజులో ఆరో వంతు మొత్తాన్ని అడ్వాన్స్‌గా చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించడంతో అదనంగా మరో రూ.313 కోట్లు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి.
మరోవైపు.. అక్టోబరు నెలలో దసరా వంటి పండుగలు, వివిధ జాతరల నేపథ్యంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబరులో మద్యం అమ్మకాల ద్వారా రూ.2,987కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి రూ.3,168 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. దీంతో మొత్తం ఆదాయం నెల రోజుల్లోనే రూ.6,348 కోట్లకు చేరుకుంది. ఎక్సైజ్‌శాఖకు భారీగా ఆదాయం రావడంతో పెండింగ్ బిల్లులు మంజూరవుతాయని మద్యం సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Uttar Pradesh: మరో రైలు ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
Follow Us