/rtv/media/media_files/2025/12/22/former-maoist-gade-innayya-arrested-2025-12-22-10-13-33.jpg)
former maoist gade innayya arrested
Remand Report Gade Innayya : మాజీ మావోయిస్ట్ నేత, సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య. అలియాస్ గాదె ఇన్నారెడ్డి పై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇన్నయ్య రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రిమాండ్ రిపోర్టులో ఏముందంటే.. ‘అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలా గాదే ఇన్నయ్య వ్యాఖ్యలు చేశాడు. వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా ఇన్నయ్య తీవ్ర వాఖ్యలు చేశాడు. వికల్ప్ అంత్యక్రియలకు సుమారు 200 మంది హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా అమరుల బంధుమిత్రుల సంఘం పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేశారు.
ఈ సభలో విద్వేషాలు రెచ్చగొట్టి మావోయిస్టు ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గాదె ఇన్నయ్య పిలుపునిచ్చాడని అధికారులు ఆరోపిస్తున్నారు. దేశంలో కుట్రలు చేసి దేశ భద్రతకు హాని కలిగించాలని తీవ్రవాఖ్యలు చేశాడని వారు ఆరోపించారు. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు పాల్పడాలని కుట్రపన్నినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై నవంబర్ 24న కేసు నమోదైంది. సీపీఐ మావోయిస్టు పార్టీకి మద్దతు తెలపడంతో పాటు వారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తానని ఇన్నయ్య ప్రసంగించాడు. ప్రజలను విద్వేషాల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. గాదె ఇన్నయ్య అనేకమంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని. మావోయిస్టు రిక్రూట్మెంట్‌తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశాడని. ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరం’ అని రిమాండ్ రిపోర్టులో ఉండటం గమనార్హం.
ఇక, మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీష్‌గడ్ కు వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లిని కలిశారు. అక్కడున్న నేషనల్, స్టేట్ మీడియాతో పాటు యూట్యూబ్ ఛానళ్లతో హిడ్మా మరణంపై ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ఈ సమయంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు నోటీసులు పంపింది. తాజాగా, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఇన్నయ్యపై కేసు నమోదు చేయడం గమనార్హం.
Follow Us