/rtv/media/media_files/2025/11/03/fotojet-2025-11-03t113740674-2025-11-03-11-38-09.jpg)
Maoist Party letter
Naxals Ceasefire : వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో కూనరిల్లుతున్న మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం ప్రకటించింది. మరోసారి కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. మరో ఆరునెలల పాటు కాల్పుల విరమణ చేయనున్నట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ ఒక లేఖ విడుదల చేశారు. ఆయుధాలు వదిలేసి ప్రభుత్వంతో చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు మరోసారి కాల్పుల విరమణ ప్రకటన చేయడం గమనార్హం.
కాగా ఈ ఏడాది ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక వర్గాలు శాంతియుత వాతావరణం కొనసాగాలని పెద్దఎత్తున ఉద్యమాలు చేశారని జగన్ లేఖలో ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించిందన్నారు. ఈ క్రమంలో గత మే నెలలో మేము 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటించామని పేర్కొన్నారు. అయితే, గడిచిన 6 నెలల కాలంలో అనుకున్న పద్ధతులను మా వైపు నుంచి అమలు జరిపి శాంతియుత వాతావరణం కొనసాగేలా వ్యవహరించామని వివరించారు. ఇదే శాంతియుత వాతావరణం కొనసాగాలని తెలంగాణ సమాజం కోరుకుంటుందని జగన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరో 6 నెలల పాటు కాల్పుల విరమణను ప్రకటిస్తున్నామని ఆ లేఖలో వెల్లడించారు. గతంలో కొనసాగిన విధంగానే తమ వైపు నుంచి శాంతియుత వాతావరణాన్ని కొనసాగించేందుకు కృషి చేస్తామని జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా గతంలో వ్యవహరించిన విధంగానే ఉండాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ఇక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న శాంతియుత వాతావరణాన్ని భంగం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. అలాంటి ప్రయత్నాలకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు, అన్ని సామాజిక వర్గాలు, సంఘాలు, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరుతున్నామంటూ మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ లేఖలో ప్రస్తావించారు.
Follow Us