/rtv/media/media_files/2025/10/08/local-2025-10-08-17-04-42.jpg)
Second phase of Panchayat elections
Telangana Panchayat Elections 2025 : తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు పోటీ పడుతున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధమయ్యారు. 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమవ్వగా ఉదయం ఆరు గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్లు ముందు బారులు తీరారు. ఆదివారం కావడంతో యువత ఎక్కువగా ఓటు వేయడానికి ఆసక్తి చూపారు. దీంతో పోలింగ్ కేంద్రాల వద్ద యువ ఓటర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. కాగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి.. ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉపసర్పంచిని ఎన్నుకుంటారు.
మొదటి విడత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం సంపాదించినప్పటికీ బీఆర్‌ఎస్ కూడా గట్టి పోటీ ఇచ్చింది. నిజానికి ఇవి పార్టీ గుర్తు లేని ఎన్నికలు అయినప్పటికీ రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఈసారి మరిన్ని ఎక్కువ స్థానాలు సంపాదించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్‌కు మరోసారి గట్టి పోటీ ఇవ్వడానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది.
రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మరో అయిదు గ్రామాలు, 108 వార్డుల్లో నామినేషన్లు అసలు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాలు, 18 వార్డుల్లో ఎన్నికలను ఆపేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీల్లో ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా 2489 మందిని నియమించారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తున్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల్సీలు తమ నియోజక వర్గంలో ఎక్కవ సర్పంచ్ సీట్లు గెలుచుకుని తమ వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవాలని శాయశక్తల కృషి చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక వాహనాలు ఏర్పటు చేసి ఓటర్లను తరలిస్తున్నారు. దీనితో గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
Follow Us