వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో అపచారం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు తమ పుట్టిన రోజులతో పాటు క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, నిరాశ్రయులకు మాంసాహారంతో కూడిన ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ.. ప్రధాన ఆలయం సమీపంలోనికి వెళ్లి మాంసాహారంతో కూడిన ఆహారం పంపిణీ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని.. మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జరిగిన సంఘటనపై ఆలయ ఈవో, పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కోరారు. ఆలయ ప్రాంగణంలో ఇలాంటి అపచారాలు సహించమని.. భక్తులకు మళ్ళీ ఇటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.
46 వేలమంది భక్తులు..
తెలంగాణలో ప్రసిద్ధి పుణ్య క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. ఇక్కడ కొలువైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రోజూ వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈరోజు కూడా 46 వేలమంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే ఎప్పుడూ లేనిది ఇలా మొట్టమొదటిసారి ఆలయ ప్రాంగణంలో అపశృతి చోటు చేసుకోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆలయ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
*రాజన్న సేవలో 46వేల మంది భక్తజనం 25 12 2024*https://t.co/sWtMKOw0Vh
— Sri Raja Rajeshwara Swamy Devasthanam (@srrsdtemple) December 25, 2024
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారిని బుధవారం 46వేల 796మంది భక్తులు దర్శించుకున్నారని ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులకు ధర్మదర్శనంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. pic.twitter.com/2sBa9ub2Sy