Kalpana : పోలీసుల అదుపులో మావోయిస్ట్‌ కీలక నేత పోతుల కల్పన..మధ్యాహ్నం లొంగుబాటు?

మావోయిస్ట్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్‌ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు(కిషన్‌ జీ) భార్య పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం సాగుతోంది.

New Update
Maoist key leader Potula Kalpana in police custody.

Maoist key leader Potula Kalpana in police custody

Kalpana : వరుసగా ఎదురు దెబ్బలు తింటున్న మావోయిస్‌లకు మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్ట్‌ దివంగత కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వర్‌రావు అలియాస్‌ కిషన్‌ జీ భార్య పోతుల కల్పన అలియాస్‌ సుజాతక్కను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.  అయితే ఆమె పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ప్రచారం సాగుతోంది.  గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలుగా గుర్తింపు పొందారు. అయితే  ఆమె మహబూబ్‌నగర్‌లో ఉండగా.. అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆమె సౌత్ సబ్ జోనల్‌ బ్యూరో ఇన్‌ఛార్జిగా పని చేస్తున్నారు. కేంద్ర కమిటీ సభ్యురాలిగా కూడా పని చేస్తున్నారు. ఆమెను కల్పన అలియాస్‌ సుజాతక్క, మైన్‌బాయి, పద్మ, ఝాన్సీబాయి తదితర పేర్లతో పిలుస్తారు. పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. 

అయితే సూజాతక్క 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారు. ఆమె భర్త కిషన్‌జీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న సమయంలో 2011లో పశ్చిమ బెంగాల్‌ జార్‌గ్రామ్‌లోని బురిషోల్ జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కిషన్‌ జీ స్వస్థలం పెద్దపల్లి జిల్లా. ఆయన సోదరుడు సైతం మావోయిస్ట్‌ పార్టీలో కేంద్ర కమిటీలో కొనసాగుతున్నారు. కిషన్‌జీ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినప్పటి నుంచి ఆమె కోసం వెతుకుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆమె వయసు 60 సంవత్సరాలు. 1984లో కిషన్‌జీని సుజాతక్క వివాహం చేసుకున్నారు.

అయితే, ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ బస్తర్‌ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో సుజాత ఉంటున్నారని.. పార్టీ నిర్మాణ బాధ్యతలు చూసుకునే ఆమె ఎందుకు బయటకు వచ్చారనే విషయం తెలియరాలేదు. అయితే, వైద్య పరీక్షల కోసం మహబూబ్‌నగర్‌కు వచ్చారా? షెల్టర్‌ జోన్‌లో ఉంటున్నారా? అన్న సమాచారం తెలియాల్సి ఉన్నది. ఆమెను ఎప్పుడు.. ఎక్కడ ? అరెస్ట్‌ చేశారన్న వివరాలు సైతం వెల్లడి కావాల్సి ఉంది. సూజాతక్క క్రాంతికారీ జనతన్ సర్కారు వ్యవహారాల్లోనూ కీలక బాధ్యతలు చూస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె అరెస్టుపై పోలీసు వర్గాలు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే సుజాతక్క అరెస్ట్‌ చేసినట్లు కాకుండా లొంగుబాటుగా చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె లొంగుబాటు గురించి మధ్యాహ్నం డీజీపీ జితేందర్‌ మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. ఆమెతో పాటు మరికొందరు మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలుస్తోంది. సుజాతక్కపై రూ.కోటి రివార్డు ఉంది. ఆమెతోపాటు మరో ముగ్గురు మావోస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమైన మీడియా సమావేశం ఉన్నదని డీజీపీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది.గతేడాది అక్టోబర్‌లో కల్పనను పోలీసులు మహబూబ్‌నగర్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చినా.. అందులో ఏ మాత్రం నిజం లేదని మావోయిస్టు పార్టీ నేతలు కొట్టి పడేశారు. అయితే, తాజాగా సుజాతక్క లొంగుబాటును పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Also Read : MIRAI MOVIE: కార్తిక్ ఘట్టమనేని టెక్నికల్ బ్రిలియన్స్ అరాచకం .. రూ .60 కోట్లతో హాలీవుడ్ రేంజ్‌! గూస్ బంప్స్ అంతే

Advertisment
తాజా కథనాలు