ఈరోజుల్లో బయటి ఆహారం ఎక్కువగా తినడం చాలామందికి అలావాటైపోయింది. ఆన్‌లైన్ ఫుడ్‌తో పాటు వీధుల్లో కూడా ఆహారాన్ని విక్రయించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో గల్లీకో టిఫిన్ సెంటర్ ఉంటోంది. కర్రీ పాయింట్‌లు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు సురక్షిత ఆహారాన్ని అందించేందుకు వీధుల్లో ఆహారాన్ని విక్రయించే వ్యాపారులందరినీ ఆహార భద్రతా ప్రమాణాల చట్టం (FSS) పరిధిలోకి తీసుకురానుంది. ఈ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరికీ కూడా రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసింది.
విధిలో ఇడ్లీ బండితో సహా అన్ని రకాల స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ అందరూ ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. ముందుగా దీన్ని హైదరాబాద్‌లో అమలు చేయనున్నారు. ఆ తర్వాత దశల వారిగా జిల్లాలోని వ్యాపారులకు వర్తింపజేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో వేలాదిమంది వీధి వ్యాపారులు ఉన్నారు. కానీ ఒక్క గుర్తింపు కూడా లేదు. వాళ్లు అందించే ఆహారం నాణ్యతపై అనుమానాలు ఉంటాయి. ఇలాంటివారిని రెగ్యులరైజ్ చేసి ఎఫ్‌ఎస్‌ఎస్ చట్టంలోకి తీసుకురావాలని ఆహార భద్రతా విభాగం నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా వీధి ఆహార వ్యాపారులందరికీ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేయనుంది.
Also Read: అప్పటిలోగా నక్సలిజం ఖతం.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే!
రిజిస్టేషన్ కోసం స్ట్రీట్ వెండర్స్ ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఆహార భద్రతా విభాగం అధికారులే టిఫిన్లు అందించే బండ్ల వద్దకు వస్తారు. విక్రేతల ఆధార్ కార్డు ఆధారంగా అప్పటికప్పుడే రిజిస్టేషన్ చేసి సర్టిఫికేట్ ఇస్తారు. ఇందుకోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. దీనిని ఏటా చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఫ్రీగానే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నప్పటికీ వ్యాపారుల్లో బాధ్యత, జవాబుదారీతనం పెంచేందుకు నామమాత్ర రుసుము తీసుకుంటామని అధికారులు తెలిపారు.
కేవలం రిజిస్ట్రేషన్‌తో మాత్రమే సరిపెట్టకుండా ఆహార పదార్థాల పరిశుభ్రత పాటించడంలో ప్రాథమిక శిక్షణ అందించాలని వైద్యారోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. భారత జాతీయ వీధి వ్యాపారుల సంఘం (NASVI) సహకారం, నెస్లే ఇండియా స్పాన్సర్‌షిప్‌తో ఇప్పటికే హైదరాబాద్‌లో 3 వేల మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఆహార తయారీలో మంచి పద్ధతులతో పాటుగా ముడి పదార్థాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేస్లే ఇండియా యాప్రాన్, గ్లోవ్స్, హెడ్‌క్యాప్, టవల్ తదితర వస్తువులు ఉండే కిట్‌ను అందిస్తారు. ఆ తర్వాత శిక్షణ తాలూకు సర్టిఫికేట్లను కూడా జారీ చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్‌తో వ్యాపారులకు గుర్తింపు వస్తుంది. అలాగే ఆహార పదార్థాల నాణ్యతపై నమ్మకం కూడా కలుగుతుంది. వ్యాపారులపై అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. అంతేకాదు బ్యాంకుల నుంచి లోన్స్ పొందే అవకాశం కూడా లభిస్తుంది. ఇక GHMC, మున్సిపల్, పోలీసు విభాగాల నుంచి వేధింపులు కూడా ఉండవు.
Also Read: కెనడాలో వెయిటర్ ఉద్యోగం కోసం ఎగబడుతున్న వేల మంది భారతీయులు!
ఈ రిజిస్టేషన్ వల్ల వ్యాపారులకు గుర్తింపుతో సహా ముద్ర రుణాల వంటివి వచ్చే ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొందరికి శిక్షణ, సర్టిఫికేట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో దాదాపు 25 వేల నుంచి 30 వేల మంది వీధి ఆహార వ్యాపారులు ఉంటారని అంచనా ఉందని.. వీళ్లందరిని ఎఫ్‌ఎస్‌ఎస్ యాక్టులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.