/rtv/media/media_files/2025/05/02/EzQW3TIlGiwHMS2saRXf.jpg)
Hyderabad Metro
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ నుంచి వైదొలగాలని లార్సెన్ అండ్ టర్బో (L&T) సంస్థ నిర్ణయించుకుంది. ఈ మేరకు L&T సంస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఓ లేఖ రాసింది. హైదరాబాద్ మెట్రోలో మొదటి దశ ప్రాజెక్ట్‌లో కంపెనీ ఎదుర్కొంటున్న భారీ నష్టాలు, అప్పులు, అలాగే ప్రతిపాదిత రెండో దశ ప్రాజెక్ట్‌లో తలెత్తే నిర్వహణపరమైన సవాళ్లను దీనికి ప్రధాన కారణమని L&T సంస్థ పేర్కొంది. ఈ సంస్థ దాదాపు రూ.19,000 కోట్ల పెట్టుబడితో 72 కి.మీ. మెట్రో రైల్ నెట్‌వర్క్ మొదటి దశ అభివృద్ధి చేసింది. ఇది 35 సంవత్సరాల రాయితీ ఒప్పందం కింద 2017లో కార్యకలాపాలను ప్రారంభించింది.
L&T has expressed its desire to offload its stake, over 90 percent, in the L&T Hyderabad Metro Rail project to either the state or central government through a new SPV, citing operational and accumulated losses@larsentoubrohttps://t.co/CZu5hEjQYC
— PSUWatch (@PsuWatch) September 15, 2025
నష్టాలు, అప్పుల భారం:
ప్రారంభం నుంచే హైదరాబాద్ మెట్రో నష్టాల్లో నడుస్తోంది. ఎల్&టి సంస్థ అంచనాల ప్రకారం, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.6,000 కోట్ల నష్టాలు పోగయ్యాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో మెట్రో సేవలు నిలిచిపోవడంతో నష్టాలు మరింత పెరిగాయి. సంస్థకు దాదాపు రూ.13,000 కోట్ల అప్పులు ఉన్నాయని, వాటిపై అధిక వడ్డీ రేట్లు భరించడం కష్టమవుతోందని ఎల్&టి తెలిపింది. టికెట్ల ద్వారా వచ్చే ఆదాయం, మాల్స్, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం నిర్వహణ ఖర్చులకు మాత్రమే సరిపోతోందని, అప్పులు, వడ్డీలు చెల్లించడానికి సరిపోవడం లేదని వివరించింది. గత ఐదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్థిక సహాయం కోరినా, తగిన మద్దతు లభించలేదని ఎల్&టి ఆరోపించింది.
రెండో దశలో సవాళ్లు:
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్‌కు మరో అతిపెద్ద సమస్యగా స్టేజ్ 2 ప్రాజెక్ట్ విస్తరణ ఎల్&టి ప్రస్తావించింది. రెండో దశ ప్రాజెక్టును ప్రభుత్వం వేరే సంస్థ ద్వారా నిర్మించాలనుకుంటోందని, మొదటి, రెండో దశల మధ్య ప్రయాణీకుల రాకపోకలు, టికెట్ల ధరలు, నిర్వహణ విషయంలో సవాళ్లు తలెత్తుతాయని ఎల్&టి హెచ్చరించింది. రెండు వేర్వేరు సంస్థలు ఒకే నెట్‌వర్క్‌పై పనిచేయడం వల్ల ప్రయాణీకులకు ఇబ్బందులు ఎదురవుతాయని, ఇది తమకు ఆర్థికంగా, నిర్వహణపరంగా పెద్ద నష్టాలను తెచ్చిపెడుతుందని తెలిపింది.
ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టులోని 90 శాతానికి పైగా వాటాను కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు విక్రయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఎల్&టి పేర్కొంది. తద్వారా ప్రాజెక్టు మొత్తం బాధ్యతలను ప్రభుత్వమే తీసుకోవచ్చని సూచించింది. ఎల్&టి ఈ నిర్ణయం తీసుకోవడం హైదరాబాద్ మెట్రో భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. ఈ పరిణామం ప్రాజెక్టు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.