/rtv/media/media_files/2026/01/30/kcr-2026-01-30-19-49-00.jpg)
KCR
KCR : తెలంగాణ రాజకీయాల్లో గత రెండు రోజులుగా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ జారీ చేసిన నోటీసులకు కేసీఆర్ స్పందించిన విషయం తెలిసిందే. విచారణకు రావాలని గురువారమే సిట్ నోటీసు ఇవ్వగా.. కేసీఆర్ వెంటనే స్పందించారు. మున్సిపల్ ఎన్నికల్లో తలమునకలై ఉన్నందున మరో తేదీ ఇవ్వాలని కోరారు. అందుకు సిట్ సుముఖత వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం మరోసారి రెండో విడత నోటీసును అందజేసింది. అయితే తనకు 65 ఏండ్లు దాటినందున తనను ఎర్రవల్లిలోనే విచారించాలన్న కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ తిరస్కరించింది. కేసీఆర్ విజ్ఞప్తిపై సిట్ అధికారులు న్యాయసలహా తీసుకున్నారు. అయితే నందినగర్‌లోని ఆయన ఇంటిలో విచారిస్తామని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఈ మేరకు నందినగర్‌లో కేసీఆర్‌ను విచారించేందుకు సిట్ అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా రేపు విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రేపు సిట్ అధికారులు విచారించనున్న నేపథ్యంలో ఈ వ్యవహారంతో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కఠ నెలకొంది. అయితే, సిట్ నోటీసులపై న్యాయ నిపుణులతో దాదాపు నాలుగు గంటల పాటు కేసీఆర్ విస్తృత మంతనాలు జరిపారు. నిన్నటి నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లోనే మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు ఉన్నారు. విస్తృత చర్చల అనంతరం ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరుకావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
కాగా చాలాకాలంగా ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో ఉంటున్న కేసీఆర్ తనను అక్కడే విచారించాలని కోరినప్పటికీ సిట్ నిరాకరించింది. ఈ క్రమంలో నందినగర్‌లోని ఆయన నివాసంలో విచారిస్తామని తెలిపింది. దీంతో సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆయనను మద్యాహ్నం 3 గంటలకు సిట్ విచారించే అవకాశం ఉంది, కాగా ఆయన విచారణ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు నందినగర్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం 65 ఏళ్లు దాటిన వారిని.. ఇంటి వద్దే విచారించాలన్న నిబంధనను దృష్టిలో ఉంచుకుని.. కేసీఆర్ తన ఇంట్లోనే అధికారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
కాగా, సిట్ విచారణకు హాజరయ్యే ముందు కేసీఆర్ తన ముఖ్య అనుచరులు, న్యాయ నిపుణులతో మరోసారి భేటీ కానున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలతో కలిసి ఈ అంశంపై రాజకీయంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. న్యాయవాదుల బృందంతో సమావేశమై, అధికారుల ప్రశ్నలకు ఎలా సమాధానం ఇవ్వాలి, చట్టపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించిన తర్వాత.. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులకు అందుబాటులో ఉండనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
కాగా, సిట్ ఇచ్చిన నోటీసులకు స్పందించిన కేసీఆర్ తను ఎర్రవల్లి నివాసంలో ఉంటున్నందున అక్కడే విచారించాలని కోరారు. కానీ, సిట్ అందుకు నిరాకరించింది. అయితే రేపు నందినగర్ లో విచారణకు రావాలని కేసీఆర్ నివాసం ముందు గోడపై నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి సిట్ అధికారులు నోటీసులు అంటించారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చే పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి నిరసనగా ఈ రోజు పలు ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు అందోలనలకు దిగాయి. కాగా రేపు మరోసారి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్ నాయకులు ప్రకటించారు. మరోవైపు కేసీఆర్ స్వయంగా విచారణకు సహకరించడం ద్వారా ప్రభుత్వానికి, పోలీసులకు ధీటైన సమాధానం ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో రేపు పరిస్థితి ఎలా ఉంటుందనే ఉత్కంఠ నెలకొంది.
Follow Us