Mla Gudem Mahipal Reddy : కాంగ్రెస్‌లో చేరి తప్పుచేశా..పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ లో చేరి పెద్ద తప్పుచేశానని, దానితో తనకు వెంట్రుక మందం కూడా ప్రయోజనం జరగలేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరాల్సి వచ్చిందన్నారు.

New Update
FotoJet - 2026-01-19T065730.164

Mla Gudem Mahipal Reddy

Mla Gudem Mahipal Reddy : తను కాంగ్రెస్‌ పార్టీలో చేరి పెద్ద తప్పుచేశానని, దానితో తనకు వెంట్రుకమందం కూడా ప్రయోజనం జరగలేదని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలో నియోజకవర్గ ప్రయోజనాల కోసం ఆ పార్టీలో చేరాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల వ్యక్తిగతంగా నాకు గానీ.. నా నియోజకవర్గ అభివృద్ధికి గానీ.. నన్ను నమ్ముకున్న ప్రజలకు గానీ కనీసం వెంట్రుక వంతు కూడా లాభం జరగలేదన్నారు. తప్పటడుగు వేశా’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పటాన్‌చెరు  జీఎమ్మార్ (GMR) ఫంక్షన్ హాల్లో  కార్యకర్తలు, కుల సంఘాలు, కాలనీల సంఘాలతో ఆయన అంతర్గతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్నతల్లిలా ఆదరించి మూడు సార్లు టికెట్‌ ఇచ్చిన బీఆర్‌ఎస్‌ను మరవలేనని, బీఆర్ఎస్ పార్టీ పట్ల కృతజ్ఞతగా.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునివ్వడం సంచలనంగా మారింది.

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లోని 104 మంది కౌన్సిలర్లను గెలిపించేలా విభాగాల వారీగా కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి నిలబడిన అభ్యర్థుల గెలుపునకు తాను సైతం ప్రచారానికి వస్తానని పేర్కొన్నారు. అందరం కలిసి కష్టపడదామని, అభ్యర్థుల గెలుపునకు కృషి చేద్దామని, ఇందుకు కార్మిక, కుల సంఘాలు, పెద్దలందరూ సహకరించాలని కోరారు. ఇందుకు కావాల్సిన వనరులు సమకూరుస్తామని మహిపాల్‌ రెడ్డి చెప్పినట్లు సమాచారం. సాధ్యమైనంత వరకు సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డి ప్రచారం చేస్తారని, తాను కూడా కలిసి పని చేస్తానని మహిపాల్‌రెడ్డి అన్నారు

 కాగా, పార్టీ ఫిరాయింపుల కేసులో సుప్రీంకోర్టు నుండి ఎదురవుతున్న ఒత్తిడి, అనర్హత వేటు పడే అవకాశం ఉందన్న భయంతోనే.. మహిపాల్‌ రెడ్డి తాను పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడినే అని నిరూపించుకోవడానికి ఆయన ఈ వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు.. స్థానికంగా చర్చ జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ స్థానిక నాయకుల నుంచి ఆయనకు ఎలాంటి సహకారం అందకపోవడం, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయుల నుంచి ఎదురవుతున్న తీవ్ర వ్యతిరేకత కూడా కారణంగా తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో తన బలాన్ని నిరూపించుకుని.. తిరిగి బీఆర్ఎస్‌లో క్రియాశీలకం కావడమే ఆయన అసలు లక్ష్యంగా ఉన్నట్లు కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన సోదరుడు మధుసూదన్‌ రెడ్డి ఇప్పటికే బీఆర్‌ఎస్‌ లో ఉండటంతో పాటు ఇటీవల మాజీ మంత్రి హరీష్‌రావును కలిసి మహిపాల్‌ రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరుతాడన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా పార్టీనుంచి సానుకూల స్పందన వస్తుందనే నమ్మకంతో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు