/rtv/media/media_files/2025/06/16/EMG4ml3aM6FFdfKB3kZe.jpg)
KTR
భారతదేశంలో ప్రభుత్వాలు యువత ఆకాంక్షలను విస్మరిస్తే, నేపాల్ తరహా 'జెన్-జెడ్' నిరసనలు జరిగే ప్రమాదం ఉందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. శనివారం ముంబైలో జరిగిన 'ఎన్డీటీవీ యువ 2025' సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"నేపాల్‌లో ఇటీవల జరిగిన ఘటన కేవలం ప్రజాస్వామ్యం, యువత గొంతును అణచివేయడం మాత్రమే. మొదట మీడియా కూడా ఆ యువకుల నిరసనలను ఇంటర్నెట్ అంతరాయాలపై చేస్తున్నట్లు ఎగతాళి చేసింది. కానీ వాస్తవానికి వారు తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు" అని కేటీఆర్ అన్నారు.
Shame.!!! 🤬
— Chandra🇮🇳🚩 (@Chandra4Bharat) September 20, 2025
KTR thinks that Nepal-like protests may happen in India.!!!
But, instantly slapped by the Gen Z spectators.!! pic.twitter.com/7noFqPG0pw
భారత్‌లో కూడా ఇలాంటి నిరసనలు సాధ్యమేనా అని ఎన్డీటీవీ ప్రశ్నించగా.. "ప్రభుత్వాలు యువతని, వారి ఆకాంక్షలను విఫలం చేస్తే, ఇలాంటివి భారత్‌లో కూడా సాధ్యమేనని KTR బదులిచ్చారు. దేశ యువతలో 65% కంటే ఎక్కువ మంది 35 సంవత్సరాల లోపు వారేనని, వారి శక్తిని నిర్మాణాత్మక పురోగతికి ఉపయోగించుకోవాలని ఆయన ప్రభుత్వాలను కోరారు.
కేటీఆర్ మాట్లాడుతూ, "ప్రభుత్వాలు యువత శక్తిని తక్కువ అంచనా వేస్తాయి. కానీ వారిలో నిరాశ పెరిగినప్పుడు అది ఉద్యమాల రూపంలో బయటపడుతుంది. మతపరమైన లేదా సాంస్కృతిక విభజన సమస్యల కంటే, మౌలిక వసతులు, ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని కేటీఆర్ అన్నారు. భారతదేశం పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్‌తో పోల్చుకోవడం మానుకుని చైనా, జపాన్, అమెరికాలతో పోటీపడాలని ఆయన కోరారు.
1945లో అణు దాడులతో నాశనమైన జపాన్, కేవలం 23 ఏళ్లలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎలా ఎదిగిందని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి వంటి విషయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. సోషల్ మీడియాలో నిరసనలు మాత్రమే సరిపోవని, రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని, వ్యవస్థను సవాల్ చేయాలని యువతకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు 400 ఎకరాల అటవీ భూమిని కాపాడటానికి చేసిన పోరాటాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఆ పోరాటాన్ని ప్రశంసిస్తూ, యువత తమ కలలను సాకారం చేసుకోవడానికి, దేశ భవిష్యత్తును రూపొందించడానికి కష్టపడాలని సూచించారు.