/rtv/media/media_files/2025/07/19/telnagana-rains-2025-07-19-07-06-54.jpg)
హైదరాబాద్లో నిన్న భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో 60-100 మిల్లీమీటర్ల (మి.మీ) వర్షపాతం నమోదైంది. కొన్నిచోట్ల 150 మి.మీ వరకు భారీ వర్షాలు కురిశాయి.కొన్ని ప్రాంతాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలు చూసుకుంటే.. బాలానగర్ లో115.8 మి.మీ, కంటోన్మెంట్, బోయిన్ పల్లిలో 115 మి.మీ, మారేడ్‌పల్లి 112 మి.మీ, ఉప్పల్ 105 మి.మీ, మల్కాజ్‌గిరిలో 97 మి.మీ, ఇబ్రహీంపట్నంలో 96 మి.మీ, బండ్లగూడలో 95 మి.మీ, ముషీరాబాద్ లో 89 మి.మీ, అంబర్‌పేట్ లో 84 మి.మీ, కూకట్‌పల్లిలో 93.0 మి.మీ, చంద్రాయణగుట్టలో 91.9 మి.మీ, బేగంపేటలో 91.0 మి.మీ వర్షపాతం నమోదైంది.
ఈ భారీ వర్షాల కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లు వాగులను తలపించాయి, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల మోకాలి లోతు నీళ్లు ప్రవహించాయి, ప్రజలు గంటల కొద్దీ మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద తలదాచుకోవలసి వచ్చింది. విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
మరోవైపు తెలంగాణలో ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కూడా ఉండే అవకాశం ఉందంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉండటంతో రానున్న కొన్ని రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.