హైదరాబాద్‌లో ఖాజాగూడలో బ్రాహ్మణ కుంటలో హైడ్రా ఆక్రమణలను తొలగించింది. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవక ముందే అక్కడ ఇళ్లను తీసేయించింది. దీన్ని సవాల్ చేస్తూ మేకల అంజయ్యతో పాటూ మరి కొందరు హైకోర్ట్‌లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు హైడ్రా మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకు ముందు చెప్పినా కూడా పట్టించుకోకుండా అలా ఎలా ప్రవర్తిస్తారంటూ మండిపడింది. నోటీసులు ఇచ్చి 24 గంటలు గడవకుండానే ఇళ్ళను ఎలా తొలగిస్తారని అసహనం వ్యక్తం చేసింది. ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది.
అంతా మీ ఇష్టమేనా..
శేరిలంగపల్లి మండలం ఖాజాగూడలోని కొన్ని నిర్మాణాలు ఎఫ్టీఎల్ లో ఉన్నాయంటూ ఎలాంట నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేశారని పిటిషనర్లు హైకోర్టులో చెప్పారు. అయితే హైడ్రా అధికారులు మాత్రం అక్కడ విచారించిన తర్వాతనే చర్యలు చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వ న్యాయవాదులు నోటీసులు ఇచ్చామని తెలుపగా..అయితే నోటీసులు ఇచ్చిన 24 గంటలు కూడా గడవక ముందే కూల్చేస్తారా అంటూ జడ్జి కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుల వివరణలు తీసుకోరా అంటూ ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు సంబంధించి చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్ వివరణ తీసుకొని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.