Hyderabad Skywalks: సుందరమైన హైదరాబాద్ స్కైవాక్స్.. చూస్తే రెండు కళ్లు చాలవు!

హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను కొంతవరకు పరిష్కరించే దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోంది. మెట్రో స్టేషన్ల నుండి కమర్షియల్, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్స్ నిర్మిస్తున్నారు. ఇలా చేయడం ద్వారా మెట్రో ప్రయాణీకులకు రోడ్లు దాటడానికి బాగా ఉపయోగపడుతోంది.

New Update
Hyderabad Skywalks from Metro Stations to Commercial, Residential Complexes

Hyderabad Skywalks from Metro Stations to Commercial, Residential Complexes

Hyderabad Skywalks

హైదరాబాద్ నగరంలో క్లిష్టంగా ఉన్న ట్రాఫిక్ సమస్యలకు కొంతవరకు పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తోంది. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించే విధంగా, ప్రైవేట్ వాహనాల సంఖ్యను తగ్గించడానికి, అలాగే ప్రజారవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిలో భాగంగా మెట్రో స్టేషన్ల నుండి వాటి సమీపంలో ఉండే కమర్షియల్, నివాస భవనాల సముదాయాలకు స్కైవాక్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించాలని తెలిపింది. ఈ సందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమీషనర్ సర్ఫరాజ్ అహ్మద్ రెండు రోజుల క్రితం హెచ్ఎండిఏ స్వర్ణజయంతి భవన్‌లో నిర్వహించిన  కాంప్రెహెన్సివ్ మొబిలిటీ ప్రణాళికా సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

Hyderabad Skywalks5

Also read :  SLBC tunnel : టన్నల్‌లో ముంచుకొస్తున్న మరో పెద్ద ప్రమాదం!! ఏ క్షణమైనా..

ఇప్పటికే ఎల్ అండ్ టీ వారు పంజాగుట్ట, హైటెక్ సిటీ, ఎర్రమంజిల్ మెట్రో స్టేషన్ల నుండి వారు అభివృద్ధి చేసే మాల్స్‌కు స్కైవాక్‌లు నిర్మించారు. వాటి ద్వారా మెట్రో ప్రయాణీకులు నేరుగా ఆ మాల్స్‌లోకి వెళ్లే సౌలభ్యాన్ని కల్పించారు. అదే విధంగా జేబీఎస్, పరేడ్ గ్రౌండ్ స్టేషన్ లను కలుపుతూ ప్రయాణీకులు రోడ్డు దాటే అవసరం లేకుండా స్కైవాక్ లు నిర్మించారు. రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుండి రహేజా మైండ్ స్పేస్ కాంప్లెక్స్ లో 11 టవర్లలో కూడా దీనిని అనుసంధానం చేశారు. అక్కడ రహేజా వారు ఒక అధునాతనమైన  స్కైవాక్ ని అనేక సౌకర్యాలతో నిర్మించారు.

Hyderabad Skywalks6

ఉప్పల్ మెట్రో స్టేషన్ ను ఉప్పల్ జంక్షన్ చుట్టూ ఉన్న అన్ని రస్తాలను కలిపే విధంగా హెచ్ఎండీఏ వారు ఒక రోటరీ స్కైవాక్ నిర్మించారు. దీని ద్వారా మెట్రో ప్రయాణీకులకు రోడ్లు దాటడానికి ఇది బాగా ఉపయోగపడుతోంది. వీటిని దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్ల నుండి స్కైవాక్ నిర్మాణం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. దీనికి వివిధ రియల్ ఎస్టేట్ కంపెనీల నుండి ఇతర నివాస భవనాలు, వాణిజ్య సముదాయాల వారి నుండి మంచి స్పందన వస్తోందని ఆయన వెల్లడించారు. 

Hyderabad Skywalks3

ప్రస్తుతం డాక్టర్ అంబేద్కర్ బాలానగర్ మెట్రో స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్/ల్యాండ్ మార్క్ మాల్‌కు ఆ సంస్థ వారే స్కైవాక్ నిర్మిస్తున్నారు. అలాగే ఎల్ బీ నగర్ స్టేషన్ నుండి దాని సమీపంలో నిర్మాణంలో ఉన్న వాసవీ ఆనందనిలయం నివాస భవనాల సముదాయానికి వాసవీ గ్రూప్ వారు స్కైవాక్ నిర్మిస్తున్నారు. వాసవీ ఆనందనిలయం కాంప్లెక్స్ మొత్తం 25 ఎకరాలలో ఒక్కొక్క టవర్ లోను 33 అంతస్తులతో మొత్తం 12 టవర్స్ నిర్మించబడుతున్నాయి.

Hyderabad Skywalks4

వాటిలో పెద్ద సంఖ్యలో నివసించబోతున్న అనేక కుటుంబాలకు ఈ స్కైవాక్ చక్కటి సౌకర్యం కల్పిస్తుంది. అదే విధంగా మరికొన్ని సంస్థలు నాగోల్, స్టేడియం, దుర్గం చెరువు, కూకట్  పల్లి వంటి అనేక మెట్రో స్టేషన్ల నుండి ఈ తరహా స్కైవాక్ లు నిర్మించడానికి తమతో చర్చలు జరుపుతున్నారని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ఎవరైనా ప్రైవేట్ సంస్థలు మెట్రో స్టేషన్ల నుండి ఇటువంటి స్కైవాక్ లు నిర్మించదలిస్తే వారు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ మెట్రో రైల్ స్టేషన్ రిటైల్ అధికారి కె.వి. నాగేంద్ర ప్రసాద్ ను ఈ ఫోన్ నెంబర్ 9900093820  ద్వారా సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

Hyderabad Skywalks2

అలాగే 69 కిలోమీటర్ల మేర విస్తరించిన హైదరాబాద్ మెట్రో మొదటి దశకు చెందిన.. మొత్తం 57 స్టేషన్లలో ప్రతి స్టేషన్‌కి రెండు వైపులా రోడ్డుకు ఒక వైపు నుండి మరో వైపునకు చేరుకునే సౌకర్యం ఉందని అన్నారు. వీటిని మెట్రో ప్రయాణీకులే కాక, అన్-పెయిడ్ మార్గాలుగా ఏ ప్రయాణికులైనా వినియోగించుకోవచ్చని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. వీటిని వినియోగించుకుని ప్రమాదాల బారిన పడకుండా రోడ్డును సురక్షితంగా దాటాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు