/rtv/media/media_files/2025/10/17/diwali-cyber-criminals-2025-10-17-13-15-08.jpg)
Diwali cyber criminals
పండుగ సీజన్ వచ్చిందంటే ప్రజల్లో ఆనందం, ఉత్సాహం పెరుగుతుంది. అదే సమయంలో ఈ శుభసందర్భాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అక్రమంగా డబ్బు సంపాదించుకునే మార్గంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా ఈ-కామర్స్ సంస్థల పేర్లతో నకిలీ ఆఫర్లను, బహుమతులను ప్రకటిస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు. ఈ మోసాల ద్వారా ఇప్పటికే వందలాది మంది బాధితులు లక్షల్లో డబ్బు పోగొట్టుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Diwali cyber criminals
సైబర్ కేటుగాళ్లు ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్లు, పేమెంట్ యాప్‌ల పేర్లతో నకిలీ వెబ్‌లింక్‌లు, ప్రమాదకరమైన ఏపీకే (APK) ఫైళ్లను వాట్సాప్, టెలిగ్రామ్ లేదా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా పంపిస్తున్నారు. "దీపావళి బంపర్ డ్రా", "90% డిస్కౌంట్", "ఉచిత గిఫ్ట్ వోచర్" వంటి ఆకర్షణీయమైన నోటిఫికేషన్లతో వినియోగదారులను ట్రాప్ చేస్తున్నారు. ఈ లింకులను క్లిక్ చేయడం లేదా ఏపీకే ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడం ద్వారా మొబైల్‌లోకి మాల్‌వేర్ ప్రవేశిస్తుంది.
ఈ మాల్‌వేర్ ద్వారా నేరగాళ్లు బాధితుల ఫోన్‌పై రిమోట్ యాక్సెస్ పొందుతారు. దీనితో బ్యాంక్ ఖాతా వివరాలు, క్రెడిట్/డెబిట్ కార్డు నంబర్లు, వ్యక్తిగత డేటా, ముఖ్యంగా ఓటీపీలను (OTP) తెలుసుకుని క్షణాల్లో ఖాతాలోని డబ్బును ఖాళీ చేస్తున్నారు. కేవలం రెండు రోజుల్లోనే సుమారు 400 మందిని మోసం చేసి, పెద్ద మొత్తంలో డబ్బు దోచుకున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. తెలంగాణ వ్యాప్తంగా ఈ దీపావళి సీజన్ సందర్భంగా మొత్తం రూ. 8.5 లక్షలకు పైగా నష్టపోయిన ఘటనలు నమోదయ్యాయి.
పోలీసుల హెచ్చరికలు:
సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్నారు.
గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింక్‌లు, ఏపీకే ఫైళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.
అనధికారిక, నకిలీ వెబ్‌సైట్లలో బ్యాంకింగ్ వివరాలు నమోదు చేయవద్దు.
నమ్మకమైన, గుర్తింపు పొందిన ఈ-కామర్స్ సైట్ల నుంచే షాపింగ్ చేయాలి.
బహుమతులు, రివార్డులు, లక్కీ డ్రాల పేరుతో వచ్చే కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దు.
ఒకవేళ మోసానికి గురైతే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.
పండుగ వేళ ఆనందంగా ఉండాలి కానీ అప్రమత్తతతో ఉండాలని సైబర్ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.