HYD Rains : హైదరాబాద్ లో హై అలర్ట్.. ఉప్పొంగుతున్న మూసీ.. డేంజర్ లో హిమాయత్ సాగర్‌, ఉస్మాన్ సాగర్!

హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.  పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు.  

New Update
IMD Hyderabad issues red alert

IMD Hyderabad issues red alert

 HYD Rains: హైదరాబాద్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయమయ్యాయి. నిన్నరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగరం అతలాకుతలం అయింది. రహదారులన్నీ నీటితో నిండిపోయాయి.  పలు ప్రాంతాల్లో భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు.  వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బేగంబజార్, హిమాయత్ నగర్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్, కోఠి, నాంపల్లి,   సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. రోడ్లపై వరద నీటితో  వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.మూసీ పరివాహక ప్రాంతంలోని పలు కాలువలు పొంగి పొర్లడంతో పరసర ప్రాంతాలు నీట మునిగాయి. పురానాపూల్‌ ప్రాంతాన్ని వరద చుట్టుముట్టడంతో అక్కడ నిలిపిఉంచిన ఓ కారు వరదలో కొట్టుకుపోయింది. వెంటనే స్పందించిన యువకులు, పోలీసులు తాళ్ల సాయంతో ఆ కారును బయటకు లాగారు. అదే విధంగా జియాగూడ బైపాస్‌ రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తుండంతో పోలీసులు ఆ రోడ్డును మూసివేసి.. వాహనాలను దారి మళ్లించారు.

మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తమయ్యారు. ఉస్మాన్ సాగర్ ( గండిపేట) జలాశయం 8 గేట్లను పైకి ఎత్తి 7000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అదేవిధంగా హిమాయత్ సాగర్ జలాశయం నుంచి 5000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఈ రెండు జలశయాల్లో వరద ఉధృతి బాగా పెరిగింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో మంచిరేవుల గ్రామానికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం వచ్చిందంటే  గండిపేట జలాశయం నిండుకుండలా మారడం, గేట్లు ఎత్తడం సర్వసాధారణమైంది. తద్వారా మూసీలోకి భారీ వరద ప్రవాహం కారణంగా నార్సింగి, మంచి రేవుల గ్రామాల మధ్యన రాకపోకలు నిలిచిపోవడం పరిపాటి అయ్యింది. మూసీ నదిపై నాలుగు చోట్ల కల్వర్టులు ఉన్నా.. అన్నీ కూడా లో లెవెల్లో ఉండడంతో గండిపేట జలాశయం నాలుగు గేట్లు ఎత్తిన ప్రతిసారి ఈ కల్వర్టులపై నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో.. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు కల్వర్టులపై నుంచి రాకపోకలు నిలిపివేస్తున్నారు. దీంతో రాకపోకలు నిలిచిపోతున్నాయి.

భారీ వర్షం మూలంగా మూసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి మూసీ వరద ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మూసారాంబాగ్ బ్రిడ్జిని మూసివేశారు. బ్రిడ్జి పైకి వాహనాలను నిలిపివేశారు. ఈ మార్గంలో ఎవరూ రావద్దని పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నీటిని దిగువకు వదలడంతో అంబర్‌పేటలోని  మూసారాంబాగ్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను పూర్తిగా నియంత్రించారు. దిల్‌సుఖ్‌నగర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి వైపు నుంచి దారి మళ్లించారు.

 
పురానాపూల్, చాదర్ ఘాట్, ముసారాంబాగ్ వద్ద మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. మూసీకి వరద పోటెత్తడంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. అప్జల్ గంజ్ వద్ద శివాజీ వంతెన కింద భూలక్ష్మి ఆలయ సమీపంలో నివసిస్తున్న 55 కుటుంబాలను గోడె-కి-ఖబర్ ప్రాంతంలోని కమ్యునిటీ హాల్‌ కు తరలించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో వర్షాలతోపాటు మూసీలో వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ అధికారులతో సమీక్షిస్తున్నారు. అలాగే జలమండలి ఎండీ కూడా జంట జలాశయాల్లో వరద నీటి విడుదలపై వివరాలు ఆరా తీస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వచ్చే రెండు రోజులపాటు జలమండలిలో సిబ్బంది, అధికారులకు సెలవులు రద్దు చేసినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. సెలవులో ఉన్న ఉద్యోగులంతా వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!

Advertisment
తాజా కథనాలు