గ్రూప్-1మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసనలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయని తేల్చిచెప్పారు. ప్రిలిమ్స్ పరీక్షలు అయ్యాక విపక్షాలు ఇప్పుడు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29 ఇచ్చామని పేర్కొన్నారు. అభ్యర్థులు జీవో 29పై హైకోర్టుకు వెళ్లినప్పటికీ.. న్యాయస్థానాలు కూడా అండగా నిలిచాయని అన్నారు. ప్రతీసారి ఇలా వాయిదా పడుతూ ఉండటం వల్ల అభ్యర్థులు నష్టపోతున్నారని తెలిపారు.
Also Read: ఓఎల్‌ఎక్స్‌లో ప్రభుత్వ భూమి అమ్మకాలు.. తక్కువ ధరకే ఫ్లాట్లు!
ఇదిలాఉండగా.. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో 29తో తాము నష్టపోతున్నామని ఇటీవల హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ -1 నియామకాల్లో రిజర్వేషన్ అనుసరించడం పేర్కొన్నారు. జీవో నంబర్ 29 అమలు చేయడం వల్ల గ్రూప్-1 రాసే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అయితే దీనిపై విచారించిన న్యాయస్థానం అభ్యర్థుల పటిషన్లను కొట్టివేస్తూ గ్రూప్-1 పరీక్షలు యథావిధిగా నిర్వహించుకోవచ్చని తీర్పునిచ్చింది.
Also Read: కలకలం రేపుతున్న బాంబు బెదిరింపులు.. మరో 3 విమానాలకు..
ఈ నేపథ్యంలో అభ్యర్థులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. అయితే అక్టోబర్ 21న అంటే మెయిన్స్ పరీక్ష జరిగే రోజునే సుప్రీంకోర్టు ఈ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేయనుండటం గమనార్హం.
వివాదం ఏంటీ
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు జీవో 55ను తీసుకొచ్చారు. దీని ప్రకారం.. ఒక ఉద్యోగానికి రిజర్వేషన్ సహా అన్ని కేటగిరీల నుంచి 50 మందిని ఎంపిక చేస్తారు. మిగతా రిజర్వుడ్ పోస్టులకు ఆయా అభ్యర్థులకే అవకాశం కల్పిస్తారు. రిజర్వుడ్ అభ్యర్థులకు వారి కోటాతోపాటు ఓపెన్ కోటాలోనూ ఉద్యోగం పొందేందుకు అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 29ను తీసుకొచ్చింది.
Also Read: లెబనాన్ డ్రోన్ దాడి.. బెంజమిన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
జీవో 29 ప్రకారం ఓపెన్ కోటాలో రిజర్వుడ్ అభ్యర్థులకు ఉద్యోగం పొందే అవకాశం ఉండదు. మెరిట్ ర్యాంకు వచ్చినా కూడా ఈ కోటాలో ఛాన్స్ ఉండదు. కేవలం రిజర్వుడు కోటాలో మాత్రమే జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ జీవో వల్ల ఇలా రిజర్వుడు అభ్యర్థులకు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం లభించే అవకాశం లేకపోవడం.. కేవలం రిజర్వుడు కోటా మాత్రమే ఉండటం వల్ల కాస్త తక్కువ ర్యాంకు వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని అంటున్నారు. అందుకే జీవో 29ను రద్దు చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: స్పెషల్ చికెన్.. తింటే ఇక నో డౌట్ చావు ఖాయం!