/rtv/media/media_files/2025/08/24/vinayaka-chavithi-2025-08-24-19-25-03.jpg)
Vinayaka Chavithi
Ganesh Chaturthi : గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి మొదలవ్వనున్న వినాయక నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా నిర్వహకులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్ని మండపాలకు ఈ ఉచిత విద్యుత్ అవకాశం వర్తించనుంది. దీనితో పాటు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గామాత మండపాలకు కూడా ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది. మండపాల నిర్వహకులకు వాటి నిర్వహణలో ఎదురయ్యే ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Also Read: OG MOVIE: పవన్ 'OG' నైజాం హక్కుల కోసం దిల్ రాజు భారీ ప్లాన్ ! అంత మొత్తం పెడుతున్నారా?
అయితే మండపాలు ఏర్పాటు చేయడానికి ముందస్తు అనుమతి తీసుకున్న వారికే ఇది వర్తిస్తుంది. అలాగే అనుమతి ఉన్నవారు ఎక్కడి నుంచి విద్యుత్ తీసుకుంటున్నారు అనే వివరాలు సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించింది. ఈ ఉచిత విద్యుత్ కు సంబంధించి ఖర్చయిన మొత్తాన్ని ఉత్సవాల అనంతరం ప్రభుత్వం విద్యుత్ శాఖకు చెల్లించనుంది. కాగా గత ఏడాది కూడా మండపాలకు ఉచిత విద్యుత్ అందించారు. ఈనెల 27న వినాయక చవితి కాగా, సెప్టెంబర్ 6 వరకు నవరాత్రి ఉత్సవాలు జరపనున్నారు. హైదరాబాద్‌లో గణేశ్ మండపాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత పొందిన ఖైరతాబాద్ గణనాథుడిని విగ్రహ నిర్మాణం తుది దశకు చేరుకుంది.