Gas Cylinder Blast: లైవ్ వీడియో.. తెలంగాణలో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్.. ఇద్దరు డెడ్

మేడ్చల్‌లో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. ఆ బిల్డింగ్‌లో ఉన్న 3 దుకాణాలు భారీ పేలుడుకి ధ్వంసం అయ్యాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

New Update

ఇటీవల కాలంలో తెలంగాణలో గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ తరహా ప్రమాదాలు ప్రాణనష్టంతో పాటు తీవ్ర గాయాలకు కారణమవుతున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని దోమలగూడలో భారీ బ్లాస్ట్ జరిగింది. బోనాల పండుగ సందర్భంగా ఓ ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు స్పాట్‌లో చనిపోయారు. 

అలాగే కూకట్‌పల్లిలో గ్యాస్ కట్టర్ పేలుడు సంభవించి ఒకరు మరణించారు. అంతేకాకుండా మైలార్‌దేవ్‌పల్లిలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలి ఒక ఇల్లు కూలిపోయింది. సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమైంది. అమీర్‌పేట్‌లోని ఒక కేఫ్‌లో సిలిండర్ పేలి ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ ప్రమాదాలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. 

తాజాగా ఇలాంటిదే మరొక ఘోరమైన గ్యాస్ సిలిండర్ బ్లాస్ జరిగింది. తెలంగాణలోని మేడ్చల్ పట్టణంలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. స్థానిక బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఒక భవనం పూర్తిగా కూలిపోయింది. అదే సమయంలో ఆ బిల్డింగ్‌లో ఉన్న 3 దుకాణాలు భారీ పేలుడుకి ధ్వంసం అయ్యాయి. 

ఈ పేలుడు దాటికి బిల్డింగ్‌లో ఉన్న జనం రోడ్డుపైకి ఎగిరిపడినట్లు తెలుస్తోంది. ఈ ఘోరమైన ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లో ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే మేడ్చల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గ్యాస్ లీక్ అయి, సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి ఇల్లు మొత్తం ఒక్కసారిగా శిథిలమైంది. భారీ శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలో నివసించే వారు ఉలిక్కిపడి బయటికి పరుగులు తీశారు. సమాచారం అందుకుని వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు, స్థానికులు తీవ్రంగా కష్టపడుతున్నారు. ఇలా దాదాపు రెండు గంటలపాటు శ్రమించి గాయపడిన ఆరుగురిని బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఇల్లు కూలిపోవడంతో ఆ కుటుంబం పూర్తిగా నిరాశ్రయులైంది. వారికి తక్షణ సాయం అందించాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Advertisment
తాజా కథనాలు