Cyber Fraud in Land Registrations : భూభారతిలో లోపాలు..రూ.48 కోట్లు దారి మళ్లీంపు

సాఫ్ట్‌వేర్‌లోని లోపాలను ఆధారంగా చేసుకొని  భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్మును పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించారు. సుమారు రూ.42 కోట్ల సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు.

New Update
FotoJet - 2026-01-11T151117.556

Cyber Fraud in Land Registrations

Cyber Fraud in Land Registrations : సాఫ్ట్‌వేర్‌లోని లోపాలు, చెల్లింపుల మార్గంలో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకొని  భూముల రిజిస్ట్రేషన్‌ కోసం చెల్లిస్తున్న స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చలానాల సొమ్మును పలువురు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు పక్కదారి పట్టించారు. భాభారతి పోర్టర్‌లో ఉన్న లోపం వారికి వరంగా మారింది. వాటిని ఆధారంగా చేసుకుని  ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన సుమారు రూ.42- కోట్ల  సొమ్మును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలిసింది. 2020లో ధరణి పోర్టల్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల బాధ్యతను రిజిస్ట్రేషన్‌ శాఖ నుంచి తహసీల్దార్‌లకు అప్పగించిన నాటి నుంచి ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎవరి కంటా పడకుండా అతి తెలివితో మాల్‌వేర్‌ ఉపయోగించి పెద్దఎత్తున డబ్బులు దారిమళ్లించారు. నాలుగు రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగ లాగగా... రాష్ట్రమంతటా డొంక కదిలింది. ఇప్పటివరకు 4,800 లావాదేవీల్లో సొమ్ము దారిమళ్లినట్లు గుర్తించారు. అత్యధికంగా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువగా దోపిడీ జరిగినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర కూడాఉందని తేలింది.

గడచిన ఆరేళ్లలో ఇలా రూ.42 కోట్ల వరకు అక్రమార్కులు దారిమళ్లించినట్లు తెలిసింది. జనగామలో  మొదట ఈ విషయం వెలుగు చూడగా, దీనిపై సీసీఎల్‌ఏ విచారణకు ఆదేశించగా.. పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు తేలింది. ధరణి నుంచి మొదలై.. భూ భారతి దాకా గడచిన ఆరేళ్ల జరిగిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల లావాదేవీలు జరిగాయి. వీటికి సంబంధించి వచ్చిన స్టాంప్‌డ్యూటీ రూ.13 వేల కోట్లు అని సీసీఎల్‌ఏ ఆడిట్‌లో తేల్చారు. కాగా, మొత్తం 52 లక్షల లావాదేవీల్లో.. 4,300 లావాదేవీలకు సంబంధించి నగదు తేడా ఉన్నట్లు గుర్తించారు. పోర్టల్‌లో సాంకేతికంగా లోపాలు ఉండటంతోపాటు ఆరేళ్లుగా ఆడిట్‌ జరగకపోవడంతో అక్రమార్కులు తమ ఇష్టరీతిన మోసాలకు పాల్పడినట్లు వెల్లడైంది. మీసేవ నిర్వాహకులు ఇచ్చే ఇన్‌ఫుట్స్‌ను ప్రశ్నించే, తనిఖీ చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని భూభారతి పోర్టల్‌లో అనుసంధానం చేయకపోవడంతోఅక్రమార్కులు స్టాంప్‌ డ్యూటీని సులువుగా దారిమళ్లించినట్లు తేల్చారు.

జరిగిందిలా....

జనగామ జిల్లా కేంద్రంలోని  కొన్ని  ప్రైవేట్‌ ఆన్‌లైన్‌ కేంద్రాల ద్వారా భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లకు చెల్లించాల్సిన సొమ్ము పక్కదారి పడుతున్నట్లు మొదట గుర్తించారు. వీరికి యాదగిరిగుట్టకు చెందిన ఓ ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకుడు సహకరిస్తున్నట్లు గుర్తించారు.  ఈ విషయమై జనగామ తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేయగా... తీగ లాగడంతో డొంకంతా కదిలింది. నాటి ధరణి, నేటి భూభారతి పోర్టల్‌ల వేదికగా సాగు భూముల రిజిస్ట్రేషన్లు మ్యుటేషన్లు, గిఫ్ట్‌ డీడ్‌ తదితర లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారని తేలింది. రైతులు భూమి రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్‌ సెంటర్‌కు వస్తుంటారు. సర్వే నంబరు ఆధారంగా విస్తీర్ణాన్ని బట్టి మార్కెట్‌ విలువ ప్రకారం ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు చెల్లిస్తుంచాల్సి ఉంటుంది. వారు చెల్లించే మొత్తాన్ని ఆన్‌లైన్‌ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ కాకుండా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి కొల్లగొడుతున్నట్లు తేలింది. రూ.లక్షకు రూ.10 వేలు మాత్రమే ఖజానాకు చేరేలా చేసి మిగిలిన మొత్తాన్ని దారిమళ్లిస్తున్నారని వెల్లడైంది.

రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఎక్కువ

కాగా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2020 నవంబరు 2 నుంచి సాగు భూముల పోర్టల్‌ ధరణి అమల్లోకి తీసుకువచ్చింది. టెర్రా ఐసిస్‌ అనే ప్రైవేట్‌ సంస్థ దీని నిర్వహణ చేపట్టింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ సంస్థ నుంచి ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్‌ ఇన్‌ఫర్మేటిక్‌ సెంటర్బ్‌ఎన్‌ఐస్శీకి మార్చింది. అయితే పోర్టల్‌లోని సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లొసుగులను వాడుకుని కొందరు ఈచలానా రూపంలో చెల్లించే సొమ్ములను దారిమళ్లించారు. పోర్టల్లో ఇప్పటివరకు 50 లక్షల లావాదేవీలు జరిగినట్లు  అంచనాలున్నాయి. వాటిలో రెవెన్యూశాఖ జల్లెడ పట్టినంత వరకు రూ.48 కోట్ల మొత్తం దారిమళ్లినట్లు తేలింది. ఇంకా ఎక్కువే ఉండవచ్చన్న అనుమానాలు ఉన్నాయి. ఇందులో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన లావాదేవీలే ఎక్కువగా ఉండటం గమనార్హం.

దోపిడీ వెనుక బడా ముఠా

ధరణి పోర్టల్‌ మొదలైనప్పటి  నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారు... ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయి... రెండింటికి మధ్య పొంతన ఉందా అనే వివరాలను గుర్తించేందుకు అసలు ఇంతవరకు ఆడిటింగ్‌ జరగలేదు. దీంతో నిందితులకు ఇది ఆసరాగా దొరికింది. కాగా దోపిడీకి కారణమైన జనగామ, యాదాద్రి జిల్లాల్లో ఒక ముఠాను పోలీసులు గుర్తించారు. యాదగిరిగుట్టకు చెందిన బస్వరాజ్‌ అనే ఆన్‌లైన్‌ సెంటర్‌ నిర్వాహకుడు చుట్టుపక్కల ఆన్‌లైన్‌ సెంటర్లకు ఈచలానా చెల్లింపుల్లో సాయం చేస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు ఆ ఆన్‌లైన్‌ సెంటర్ల వారికి ఒక్కో లావాదేవీకి రూ.5 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు తేలింది. రంగారెడ్డి, మేడ్చల్‌మల్కాజిగిరి జిల్లాల్లో భారీ ధరలున్న భూముల లావాదేవీల విషయంలోనే పెద్దఎత్తున దోపిడీ జరిగినట్లు, ఇందులో పలువురు బడా దోపిడిదార్లు తెరవెనుక ఉన్నట్లు అనుమానిస్తున్నారు.  

రెవెన్యూ అధికారుల పాత్రపై  అనుమానం..

రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత ప్రింట్‌ అయ్యే డీడ్‌ పత్రాలపై భూమి మార్కెట్‌ విలువ, చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం, రైతు చెల్లించిన వివరాలన్నీ ప్రచురితమవుతాయని సీసీఎల్‌ఏ అధికారులు చెబుతున్నారు. పోర్టల్‌ నుంచే ఆటోమేటిక్‌గా   ఈ వివరాలు అన్ని తహసీల్దారు వద్ద ప్రింట్‌లో వస్తాయి.. ఆ తరువాత తహసీల్దారు సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో గుర్తించే వీలున్నా ఎందుకు పట్టనట్లు తహసీల్దార్లు వ్యవహరిస్తున్నారనే అంశంపై విచారణ చేస్తున్నారు.  ఈ విషయంపై రెవెన్యూశాఖ అప్రమత్తమైంది. రెవెన్యూశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్‌ కలెక్టర్లతో పాటు ఎన్‌ఐసీలోని నిపుణులనూ అప్రమత్తం చేశారు. పలు జిల్లాలకు చెందిన లావాదేవీల ఈఫైళ్లను వడపోశారు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో దేవరకద్ర, రాజాపూర్‌ మండలాలకు చెందినవి కూడా ఉన్నాయని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఈ విషయమై నివేదిక సమర్పించాలంటూ ప్రభుత్వానికి లోకాయుక్త జస్టిస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. జనగామ జిల్లాలో ఒకేరోజు రూ.8 లక్షల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పక్కదారి పట్టించిన విషయం పత్రికల్లో ప్రచురితం కావడంతో లోకాయుక్త సుమోటోగా  స్వీకరించింది. అలాగే ఈ లావాదేవీలన్నింటినీ ఆడిట్‌ చేసి.. ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రైవేటు వ్యక్తులు స్వాహా చేసిన చలానాల మొత్తం రూ.42 కోట్లను రికవరీ చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీసీఎల్‌ఏ ఆదేశించారు. అంతేకాకుండా భూ భారతి పోర్టల్‌కు రిజిస్ట్రేషన్‌ శాఖ వెబ్‌సైట్‌ను అనుసంధానం చేయనున్నట్లు, ఆ శాఖ వినియోగించే సాంకేతికతనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు