/rtv/media/media_files/2025/05/19/ZG5IYNxMtzvNxOQaKdHZ.jpg)
HYDRAA
HYDRA: ఆక్రమార్జనకు అలవాటు పడిన కొంతమంది డిజిటల్ మీడియా పేరుతో ఒక వ్యక్తిని బెదిరించి హైడ్రా పేరు చెప్పి రూ.50 లక్షలు వసూలు చేశారు. అయితే తాము మోసపోయామని తెలుసుకున్న సదరు వ్యక్తి హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తితో కలిసి డిజిటల్ మీడియా ప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి కొందరు రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తెలిసింది.
దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ తుక్కుగూడ మునిసిపాలిటీ మంఖాల్ గ్రామం పరిధిలో వర్టెక్స్ అనే నిర్మాణ సంస్థ లే అవుట్ అభివృద్ధి చేసింది. అయితే ఆ సంస్థ సూరం చెరువును ఆక్రమించడంతో పాటు కొత్తకుంటలో మట్టిపోసి బాక్స్ డ్రైన్ నిర్మించిందని హైడ్రాకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టిన హైడ్రా నిర్మాణ సంస్థపై రెండు కేసులు నమోదు చేసింది. ఇదే విషయంలో తమ భూమిని ఆక్రమించి వర్టెక్స్ సంస్థ రోడ్డు నిర్మించిందని చైతన్యరెడ్డి అనే వ్యక్తి హైడ్రాకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సంబంధిత కేసు విషయమై హైడ్రా అధికారులతో మాట్లాడుతానంటూ.. అందరి జీవితాల్లో `వెలుగు`లు నింపుతామని ప్రచారం చేసుకుంటున్న ఓ డిజిటల్ మీడియా ప్రతినిధి ముందుకు వచ్చాడు. ఆయనకు తోడు మరో డిజిటల్ మీడియా ప్రతినిధిగా చెప్పుకునే వ్యక్తి కలిసి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. వీరికి దొంగ న్యాయవాది తోడయ్యాడు. ఇటీవలే హైకోర్టు బార్ కౌన్సిల్ తొలగించబడిన ఆ వ్యక్తి నువ్వు వార్త ప్రసారం చేయు.. నువ్వు హైడ్రా అధికారులతో మాట్లాడు.. నేను డబ్బులు తీసుకువస్తానంటూ సదరు న్యాయవాది ఈ కథంతా నడిపి ఆ వ్యక్తి వద్ద రూ. 50 లక్షలు వసూలు చేసినట్టు తెలిసింది. అయితే వారి చేతిలో మోసపోయిన వ్యక్తి చివరికి హైడ్రాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ మరోసారి ప్రజలను అప్రమత్తం చేశారు. ఫిర్యాదుదారులు ఏదేని ఫిర్యాదు చేయాలనుకుంటే నేరుగా హైడ్రా ఉన్నతాధికారులను సంప్రదించాలని.. సమస్య ఉంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇరు పక్షాల సమక్ష్యంలోనే విచారణ చేపట్టి న్యాయబద్ధంగా హైడ్రా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో వర్టెక్స్ సంస్థకు సంబంధించిన ఫిర్యాదులపై ఇరు పక్షాల సమక్షంలో విచారణ చేపట్టింది హైడ్రా. నిష్పక్ష పాతంగా జరుగుతున్న విచారణను చూసిన చైతన్య రెడ్డి తాను ఎలా మోసపోయానో వివరంగా హైడ్రా కమిషనర్ ముందు వాపోయింది. దీంతో ఇద్దరు డిజిటల్ మీడియా ప్రతినిధులతో పాటు.. హైకోర్టు బార్ కౌన్సిల్ నుంచి తొలగించిన న్యాయవాది భాగోతం బయట పడింది.ఇదే విషయమై చైతన్య రెడ్డిని, సదరు మీడియా ప్రతినిధిని హైడ్రా అధికారులు ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించగా.. మోసం బయట పడింది. దీంతో ఆ ప్రతినిధి తెల్లముఖం వేయడం జరిగింది. హైడ్రా నిష్పక్షపాత విచారణను అన్ని దశల్లో చూసిన చైతన్య రెడ్డి.. తాను దళారుల చేతిలో మోసపోయానని గ్రహించి.. పూర్తి విషయాలను హైడ్రా ముందు వెల్లడించారు.మొత్తం ఈ ఉదంతంపై సాక్ష్యాధారాలతో పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్లో గురువారం హైడ్రా కేసు పెట్టింది. కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను అందజేసింది. మోసానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
Also Read: 13 ఏళ్ల బాలుడి ప్రాణం తీసిన న్యూడిల్స్.. ఈ విషయం తెలిస్తే ఇంకోసారి చచ్చినా తినరు!