తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడు రేవంత్ సర్కార్ ముందు సవాళ్లు ఉన్నాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రామీణ స్థాయిలో కూడా మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం గ్రామాల వారిగా సర్వే చేయించి టికెట్ల ఎంపిక కోసం ఫీడ్‌బ్యాక్ తీసుకోనుంది. ముందుగా పార్టీ కార్యకర్తలు, గ్రామాల్లో సోషల్ సర్వీస్ చేసే వాళ్లు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న వారు. ఇలా మూడు కేటగిరీలుగా నేతలను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేయనుంది.
మరో విషయం ఏంటంటే ఈ విషయం ఆయా వ్యక్తులకు తెలియకుండానే సర్వే చేయాలని యోచిస్తోంది. ఈ సర్వేను టీపీసీసీ సోషల్ మీడియా, ఓ సంస్థ సర్వే ప్రతినిధులు, పార్టీలోని ముఖ్య నేతలు సమన్వయంగా నిర్వహించనున్నట్లు సమాచారం. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు మందు కూడా కాంగ్రెస్ ఆరు నెలల నుంచే వివిధ సర్వేలు చేయించింది. అలాగే ఏఐసీసీ రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సర్వేను కూడా ప్రమాణీకంగా తీసుకున్నారు. ఎప్పటికప్పడు పార్టీ కోసం, టికెట్ కోసం పాటుపడ్డ ఆశావాహుల పరిస్థితిని పసిగట్టారు. ప్రజల నుంచి వాళ్లకు వస్తున్న ఆదరణను కూడా పరిశీలించారు. చివరికి ఏఐసీసీ కూడా సునీల్ కనుగోలు సర్వీసును ఫాలో అవుతూ.. టికెట్లు కేటాయించిందని గతంలో కాంగ్రెస్ నేతలే తెలిపారు.
దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచేందుకు మార్గం సుగమమైంది. ప్రజల పల్స్‌ను పట్టుకోవడం వల్లే టికెట్ల ఎంపికను సమర్థవంతంగా చేశామని పార్టీ నేతలు చెప్పారు. దీని ఫలితంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలు ఉండగా, 5,984 ఎంపీటీసీలు, 535 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. వీటిలో 90 శాతం సీట్లు పక్కాగా సాధించాలని కాంగ్రెస్ నేతలు టార్గెట్ పెట్టుకున్నారు. ఈ గెలుపు ప్రభావం రాబోయే మున్సిపల్ ఎన్నికలపై కూడా చూపుతుందని భావిస్తున్నారు. అటు లోకల్.. ఇటు మున్సిపల్ ఆఫీస్‌లపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తే... మరో పదేళ్లు పవర్‌కు ఢోకా లేదని సీఎం రేవంత్ లెక్కలు వేస్తున్నారు.
మరోవైపు బీఆర్‌ఎస్‌కు కూడా రాష్ట్రంలోని గ్రామీణ స్థాయిలో కేడర్ బలంగా ఉంది. గతంలో ఈ పార్టీ ఏకంగా 33 జడ్పీ ఛైర్మన్ స్థానాలను కైవశం చేసుకుని తిరుగులేని పార్టీగా అవతరించింది. ఇక బీజేపీ కూడా ఓటింగ్ శాతం క్రమంగా పెంచుకుంటోంది. పార్లమెంటు ఎన్నికల్లో కూడా కమలం పార్టీ కాంగ్రెస్‌కు గట్టి పోటీనిచ్చి 8 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్‌గా వర్క్ చేయాలని కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్ని జిల్లాల డీసీసీలకు ఆదేశాలు జారీ చేశారు. మరి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలుస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.