/rtv/media/media_files/2026/01/12/cm-revanth-2026-01-12-18-17-33.jpg)
CM Revanth
సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తల్లిదండ్రులను పట్టించుకోని ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తామని హెచ్చరించారు. సోమవారం ప్రజాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో బాల భరోసా స్కీమ్, ప్రణామ్ డే కేర్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే వాళ్ల జీతాల్లో 10 నుంచి 15 శాతం కోత విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై బిల్లు తీసుకురానున్నామని పేర్కొన్నారు.
అలాగే దివ్యాంగులకు మానవీయ కోణంలో సాయం చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఒకరినొకరు వివాహం చేసుకుంటే రూ.2 లక్షల ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. వాళ్లని ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సాయం అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులకు రూ.50 కోట్లతో పరికరాలు అందించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వీరికి సముచిత స్థానం కల్పిస్తామని.. క్రీడల్లో రాణించినవారికి ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. కో ఆప్షన్ సభ్యులుగా ట్రాన్స్‌జెండర్‌ను కార్పొరేటర్‌గా నామినేట్ చేయాలని మంత్రులను కోరుతున్నానని తెలిపారు. ట్రాన్స్‌జెండర్ సమస్యలను వాళ్లే చెప్పుకొనే ఛాన్స్ ఇవ్వాలన్నారు. ప్రణబ్ కార్యక్రమంలో వృద్ధులను ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ వైద్యం అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. దాదాపు వందేళ్ల తర్వాత రాష్ట్రంలో కులగణన జరిగిందన్నారు. కులాల జనాభా ఆధారంగా నిధులు కేటాయించాలన్నారు. మా ఒత్తిడితోనే కేంద్రం కులగణన చేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మాపై మోపి వెళ్లిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.18 వేల కోట్లు కాగా.. ప్రతీ నెలా రూ.22 వేల కోట్లు అప్పులకు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు.సగటు మధ్యతరగతి వ్యక్తి గౌరవంగా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రభుత్వానిది కూడా అదే పరిస్థితని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేది కేవలం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదని.. పదిన్నర లక్షల మంది ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వాములేనని తెలిపారు. గతంలో మీ జీతాలు ఎప్పుడొచ్చేవి.. ఇప్పుడు ఎప్పుడు వస్తున్నాయో ఒకసారి ఆలోచించండని ప్రభుత్వ ఉద్యోగులకు సూచించారు. సంక్రాంతి కానుకగా మీ డీఏపై సంతకం చేసి వచ్చానని పేర్కొన్నారు.
Follow Us