/rtv/media/media_files/2025/01/13/qa5pGQkwOLDni36JJ4k2.jpg)
CM Revanth
పెట్టుబడులకు గమ్య స్థానంగా ఇప్పటికే తెలంగాణ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ విదేశాల్లో పేరొందిన కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణముందని తెలిపారు. ఫ్యూచర్ సిటీగా వెలుగొందుతున్న హైదరాబాద్ సిటీలో ఉన్న సానుకూలతలను ప్రపంచ వేదికపై పరిచయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానం అందరినీ ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తొలి ఏడాదిలోనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివద్ధి పనులన్నీ తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టాయని అన్నారు.
Also Read: మోదీ, అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరూ ఒక్కటే : రాహుల్ గాంధీ
జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పరిశ్రమల శాఖపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జనవరి 20 నుంచి దావోస్ పర్యటన నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడుల సమీకరణ, వాటి పురోగతిని సీఎం రేవంత్ సమీక్షించారు.
గత ఏడాది ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఏయే కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలను ప్రారంభించాయి.. అవి ఏయే దశలో ఉన్నాయని సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. తొలి ఏడాదిలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. ''గత ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో చేసుకున్న ఒప్పందాలతో రాష్ట్రానికి రూ.40232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 14 ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. దాదాపు 18 ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదిరాయి. వీటిలో దాదాపు 17 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని'' అధికారులు సీఎంకు వివరించారు. పది ప్రాజెక్టులు వివిధ దశల్లో వేగం పుంజుకున్నాయని, ఏడు ప్రాజెక్టుల అమలు ప్రారంభ దశలో ఉందని చెప్పారు. కంపెనీల వారిగా పురోగతిని మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం చర్చించారు.
Also Read: జూకర్‌బర్గ్ చెప్పింది తప్పు.. అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు
ఈ నెల 16 నుంచి 19 వరకు సింగపూర్, 20 నుంచి 22 వరకు సీఎం దావోస్‌లో పర్యటించనున్నారు. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ఉంటారు. సింగపూర్‌లో స్కిల్ యూనివర్సిటీతో ఒప్పందాలతో పాటు ఇతర పెట్టుబడులకు సంబంధించి సంప్రదింపులు జరుపుతారు. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొంటారు. ఈ ఆరు రోజుల పర్యటనకు సంబంధించిన షెడ్యూలుతో పాటు, అక్కడ జరిగే సదస్సులు, వివిధ పరిశ్రమల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశాల ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు.