ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హుల ఎంపికపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. భూమి లేని నిరుపేద కూలీ కుటుంబాలను ఆదుకునేందుకే ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు సీఎం. అయితే ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన కుటుంబాలకే ఈ పథకం వర్తిస్తుందని సీఎం తెలిపారు. ఈ పథకానికి సంబంధించి గైడ్ లైన్స్ ఫైనల్ చేయాలని నిన్న కలెక్టర్లతో జరిగిన సమావేశంలో సీఎం సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద అర్హులకు తెలంగాణ గవర్నమెంట్ రూ.12 వేలు అందించనుంది. 2025 జనవరి 26 నుంచి రైతుభరోసా ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. సాగుయోగ్యమైన ప్రతీ ఎకరాకి రైతుభరోసా చెల్లిస్తామన్నారు. పంట వేసినా, వేయకున్నా నగదు చెల్లిస్తామన్నారు. అనర్హులకు రైతుభరోసా ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి స్థిరాస్తి, లే ఔట్‌లు, నాలా కన్వర్షన్ అయిన, మైనింగ్, ప్రాజెక్టులకు సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలన్నారు సీఎం. అర్హుల ఎంపిక పక్కాగా జరగాలి గత బీఆర్ఎస్ సర్కార్ .. సాగుయోగ్యం కాని భూములకు కూడా పెట్టుబడి సాయం అందించిందని అలాంటి తప్పులు జరగకుండా చూడాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలతో పాటు కొత్త రేషన్ కార్డుల జారీకి అర్హుల ఎంపిక పక్కాగా జరగాలని కలెక్టర్లకు సీఎం సూచించారు. జనవరి 11 నుంచి 15లోగా ఈ పథకాల అమలుకు అవసరమైన గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇక గతంలో ఉన్న నిబంధనల ప్రకారమే కొత్త రేషన్ కార్డు లను మంజూరు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక కుటుంబానికి ఒకేచోట రేషన్ కార్డు ఉండాలన్నారు. రాబోయే రోజుల్లో వన్ స్టేట్.. వన్ రేషన్ అనే విధానాన్ని తీసుకువస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజా ప్రభుత్వం రెండు కళ్లలా భావిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. కలెక్టర్లు తమ పనితీరును ఇంకా మెరుగుపరుచుకోవాలని సూచించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒక్కసారైనా హాస్టల్స్ విజిట్ చేసి అక్కడే రాత్రి బస చేయాలన్నారు. మహిళా అధికారులు బాలికల హాస్టల్స్‌కు వెళ్లి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలని చెప్పారు. పనులలో నిర్లక్ష్యం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. జనవరి 26 తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. Also Read : ఈరోజు ఈ రాశి వ్యాపారులకు బాగా కలిసి వస్తుంది..మిగిలిన రాశుల వారికి ఎలా ఉందంటే..!