/rtv/media/media_files/2025/09/05/kavitha-2025-09-05-14-30-26.jpg)
బీఆర్ఎస్ లో రాజకీయ పరిణామలు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ కవితను సస్పెండ్ చేసింది. ఇది జరిగిన 24 గంటల్లోపే పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్లో చూపించారు. రాజీనామా అనంతరం ఆమె బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలుగా ఉన్న హరీష్ రావు, సంతోష్ రావులపై కీలకమైన ఆరోపణలు చేశారు. ముఖ్యంగా హరీష్ బయటకు కనిపించేంత మంచోడు కాదని పార్టీని లాక్కునే ప్రయత్నం చేశారంటూ కవిత సంచలన ఆరోపణలు చేశారు.
కవిత స్వచ్ఛంద సంస్థ జాగృతిలోనూ ఇప్పుడు చీలికలు ఏర్పడ్డాయి. జాగృతి నాయకుడు మేడే రాజీవ్ సాగర్ కవితపై సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కోసమే తెలంగాణ జాగృతికి పని చేశామన్నారు. తమను కవిత వాడుకుని ఇప్పుడు రోడ్డు మీద పడేశారని రాజీవ్ సాగర్ నిప్పులు చెరిగారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జాగృతి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా కవిత మాట్లాడినప్పటి నుండి తామంతా తెలంగాణ జాగృతికి దూరం అయ్యామని తెలిపారు. కవిత లేఖ రాసినప్పటి నుండే కేసీఆర్‌కు ఆమె వ్యతిరేకం అయ్యారన్న ఆయన అప్పటి నుండే మేము జాగృతిని దూరం పెట్టామని రాజీవ్ సాగర్ వెల్లడించారు. దీంతో కవిత, కేసీఆర్ వర్గాలుగా తెలంగాణ జాగృతి రెండుగా చీలింది.
వెన్నుపోటు దారుల సమావేశం
అయితే దీనిపై జాగృతి సంస్థ కూడా స్పందించింది. ఈ సమావేశం తిరుగుబాటుదారుల సమావేశం అనే బదులుగా వెన్నుపోటు దారుల సమావేశం అని నిర్వహించి ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుందని విమర్శి్ంచింది. బీఆర్ఎస్ లోని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు లాంటి వాళ్ల మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన ఈ సమావేశం పెట్టినట్లుగా అనిపిస్తుందని తెలిపారు. జాగృతి అనే సంస్థ ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధిగా వ్యవహరిస్తుంది కానీ అది అనుబంధ సంస్థ కాదన్న విషయం తెలుసుకోవాలని అన్నారు. జాగృతి సంస్థను లేకుండా చేయాలని బీఆర్ఎస్ లోని కీలక నేతలు ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.