/rtv/media/media_files/2025/10/16/maoist-top-leader-asanna-surrenders-2025-10-16-19-11-03.jpg)
Maoist top leader Asanna surrenders
MAVOISTS SURRENDER :అంతా అనుకున్నట్లే మావోయిస్టు అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్ళపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న లొంగిపోయినట్లు పోలీసులు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో భారీ సంఖ్యలో మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెడుతున్నారని హోంమంత్రి అమిత్ షా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇవాళ (గురువారం, అక్టోబర్ 16వ తేదీ) చత్తీస్‌గఢ్‌లో 170 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయాన్ని ఆయన తెలిపారు.మల్లోజుల టీమ్ లొంగిపోయిన 24 గంటల వ్యవధిలోనే ఆశన్న కూడా తన సహచరులతో కలిసి అదే బాట పట్టడం గమనార్హం.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆశన్న స్వస్థలం ప్రస్తుత ములుగు జిల్లా జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్. ఆ గ్రామంలోని తక్కళ్లపల్లి భిక్షపతిరావు, సరోజన దంపతులకు ఇద్దరు సంతానం కాగా పెద్ద కుమారుడు వాసుదేవరావు (ఆశన్న). చిన్న కుమారుడు సహదేవరావు. ఆశన్న ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం ఖాజీపేట ఫాతిమా స్కూల్‌లో సెకండరీ విద్యను అభ్యసించాడు. అ తర్వాత చిన్నతనంలోనే మావోయిస్టు భావజాలానికి ఆకర్షితుడై 1990లో అడవి బాట పట్టాడు. ఆశన్నపై 38 సంవత్సరాల క్రితం వెంకటాపూర్ పోలీస్‌స్టేషన్‌లో తొలి కేసు నమోదైంది. ఆయన మొదట కాకతీయ యూనివర్సిటీలో సీపీఐ(ఎంఎల్) పీపుల్స్‌వార్ అనుబంధ రాడికల్ స్టూడెంట్ యూనియన్‌కు నాయకత్వం వహించారు.
కాగా ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయన ఐపీఎస్ ఉమేష్‌చంద్ర, మాజీ హోంమంత్రి మాధవరెడ్డి హత్యలో కూడా ఆశన్న పాత్ర ఉందని చెబుతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం చంద్రబాబునాయుడిపై 2003 అక్టోబరు 1న అలిపిరిలో జరిగిన దాడిలో కూడా ఆశన్నదే కీలకపాత్ర. మావోయిస్టు పార్టీలో రాజకీయ వ్యూహాలు, సైనిక కార్యకలాపాల్లో ప్రచార విషయాల్లో ఆశన్ననే కీలకంగా వ్యవహరిస్తారు. 2024 నవంబరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆశన్న మరణించినట్టు వదంతులు వ్యాపించాయి. కానీ, ఆ తర్వాత ఆయన బతికే ఉన్నాడని తేలింది. ప్రస్తుతం ఆశన్న వయసు 60 సంవత్సరాలు పైబడి ఉంటుంది.
కాగా ఆశన్న లొంగు బాటు విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షావెల్లడించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. నిన్న ఛత్తీస్‌గఢ్‌లో 27మంది; మహారాష్ట్రలో 61 మంది జనజీవన స్రవంతిలోకి వచ్చారు. ఈ రోజు 170 మంది లొంగిపోయారు. దీంతో రెండు రోజుల వ్యవధిలో 258 మంది లొంగిపోయారని అమిత్ షా అన్నారు.. నక్సలిజంపై పోరులో ఇదో పెద్ద విజయమన్నారు.
కాగా మావోయిస్టులు భారత రాజ్యాంగంపై తమ విశ్వాసాన్ని ప్రకటిస్తూ హింసను త్యజించాలనే వారి నిర్ణయాన్ని అభినందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలను ఇది ప్రతిబింబిస్తుందన్నారు. తమ విధానం స్పష్టంగా ఉందని తెలిపిన అమిత్ షా.. లొంగిపోయేవారిని స్వాగతిస్తామని.. ఇంకా తుపాకీతో ఉద్యమం కొనసాగించాలనుకొనేవారు భద్రతా దళాల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. నక్సలిజం మార్గంలో ఇంకా కొనసాగుతున్న వారు ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేరాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలిస్తామన్న తమ మాటకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
అలాగే ఒకప్పుడు వామపక్ష తీవ్రవాద స్థావరాలుగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్‌లు నేడు విముక్తిపొందిన ప్రాంతాలుగా ప్రకటించడం సంతోషదాయకమని తెలిపారు. కొంత దక్షిణ బస్తర్‌లో నక్సలిజం జాడ ఉందని.. దీన్ని భద్రతా దళాలు త్వరలో తుడిచిపెడతాయని స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ సర్కార్ ఏర్పడిన తర్వాత జనవరి 2024 నుంచి 2,100 మంది మావోయిస్టులు లొంగిపోగా, 1785మందిని అరెస్టు చేశారన్నారు. 477 మందిని భద్రతాదళాలు నిర్మూలించాయని వివరించారు.
Also Read: రెబల్ స్టార్ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. 'పౌర్ణమి' 4K రీ రిలీజ్ బుకింగ్స్ ఓపెన్..!