/rtv/media/media_files/2025/03/19/xcHZ1OU4RfYk9Io0D28I.jpg)
Aarogyasri
Aarogyasri : తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వానికి బిగ్ షాక్ ఇవ్వనున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రభుత్వం నుండి రావలసిన రూ.1400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ అర్థరాత్రి నుంచి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయనున్నట్లు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. కాగా ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఆసుపత్రులు తమ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ బకాయిలు చెల్లించకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడం ఖాయమని ఆసుపత్రుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఘం ప్రభుత్వంతో చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో గుండె, కిడ్నీ సమస్యలున్న రోగులకు వైద్యం అందే అవకాశం లేకుండా పోయింది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిపివేయనున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (టీఏఎన్‌హెచ్ఏ) ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి రూ. 1400 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వద్దిరాజు రాకేష్ తెలిపారు. ఈ సమస్యపై ఆరోగ్యశాఖ మంత్రి, ఆరోగ్యశ్రీ సీఈవోలను కలిసినప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.
అయితే వైద్యరంగ వర్గాల సమాచారం ప్రకారం.. ఇటీవల ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో రూ.140 కోట్ల బకాయిలు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. దీని ప్రకారం సోమవారం రూ. 100 కోట్లు విడుదల చేశామని.. మిగిలిన రూ. 40 కోట్లు త్వరలో విడుదల చేస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రభుత్వం చెల్లించాల్సి బకాయిలు రూ.1400 కోట్లు ఉండగా రూ.140 కోట్లు చెల్లిస్తే లాభం ఏంటని ఆసుపత్రి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) కింద అందిస్తున్న సేవలకుగాను చెల్లింపులు జరపకపోవడంతో దవాఖానల నిర్వహణ భారంగా మారిందని నెట్‌వర్క్ దవాఖానలు ఇప్పటికే ప్రభుత్వానికి పలుమార్లు మొరపెట్టుకున్నాయి.
గత జనవరిలో రూ.1,100 కోట్ల బకాయిలు చెల్లించాలని నెట్‌వర్క్ దవాఖానలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయగా.. రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ సీఈవో హామీ ఇచ్చారు. దీంతో సేవలను తిరిగి ప్రారంభించారు. వారు ఇచ్చిన హామీ ప్రకారం గ్రీన్‌చానల్ ద్వారా ప్రతి నెలా ఆరోగ్యశ్రీకి రూ.200 కోట్ల నిధులు కేటాయించాల్సి ఉంది. కానీ హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆ మాట నిలబెట్టుకోలేదు. 8 నెలలు గడిచినా.. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆగస్టు 31న సేవలు బంద్ చేస్తామని అసోసియేషన్ మరోమారు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు అసెంబ్లీ జరుగుతుండగానే ఆరోగ్యశాఖ అధికారులు నెట్‌వర్క్ దవాఖానల అధ్యక్షుడికి ఫోన్ చేసి మరోసారి చర్చలకు రావాలని ఆహ్వానించారు. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో ప్రభుత్వం ప్రకటన చేస్తుందని భావించిన నెట్‌వర్క్ దవాఖానల అసోసియేషన్ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను మంగళవారం అర్ధర్రాతి నుంచి బంద్ చేయాలని నిర్ణయించింది.
ఇది కూడా చూడండి:Road accident : ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్ఫోసిస్ ఉద్యోగి మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు