/rtv/media/media_files/2025/08/29/a-century-old-irrigation-project-2025-08-29-15-28-55.jpg)
A century-old irrigation project pocharam
Pocharam Dam : లక్షలాది కోట్లు పెట్టి నిర్మించిన ప్రాజెక్టులు నెలల్లోనే కూలిపోతున్నకాలమిది. ప్రభుత్వాలు, ఇంజినీర్ల ధనదాహానికి ఎన్నో ప్రాజెక్టులు పేకమేడల్లా కుప్పకూలుతున్నాయి. నాణ్యతలేని పనులతో కట్టిన నాలుగు రోజులకే కాలగర్భంలో కలిసి పోతున్నాయి. అలాంటిది వందేండ్ల చరిత్ర ఉన్న ఒక్క ప్రాజెక్టు మాత్రం పరిమితికి మించి వరద వచ్చినా నిటారుగా నిలబడ్డది. డిజైన్చేసిన వరద సామార్ధ్యానికి మించి రెండింతలు వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడింది. అది ఎక్కడో కాదు మన తెలంగాణలోనే. తెలంగాణలో నిర్మించిన తొలి ప్రాజెక్టుపేరుగాంచిన పోచారం. ఇది కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం పోచారంలో నిజాం నవాబుల కాలంలో నిర్మితమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో మంజీరా నదికి ఉపనది అయిన ఆలేరు/మంచిప్ప వాగుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం శంకుస్థాపన చేశారు.
కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు నిజాం కాలంలో కేవలం రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది. అంటే నేటికి 103 సంవత్సరాలు. గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం తీరుస్తోంది. నిజాం ప్రభుత్వం హయాంలో సున్నపురాయితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్టతో, దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలుతో దీన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాల భూమి సాగవుతోంది. గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించినప్పటికీ, పూడిక తీయని కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు తగ్గిపోయింది. ప్రాజెక్టు లోని 73 డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా విభజించారు. 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన దాన్ని ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారు.
ఇలా అనేక ప్రత్యేకతలు కలిగిన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని తట్టుకుని ధృడంగా నిలబడింది. నిజానికి ఈ ప్రాజెక్టు MFD 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కులు మాత్రమే. కానీ, ఇప్పుడు వచ్చిన వరద చాలా ఎక్కువ. అయినా ప్రాజెక్టు తట్టుకుని నిలబడింది. ఎగువ ప్రాంతాల్లో ఉన్న గాంధారి, లింగంపేట, తాడ్వాయి మండలాల్లో నిరంతరాయంగా కురుస్తున్న వానలకు లింగంపేట పెద్దవాగు, తాడ్వాయి మండలంలోని భీమేశ్వర వాగు పొంగి పోర్లుతున్నాయి. అలా వచ్చిన వరద పోచారం ప్రాజెక్టు కు చేరుకుంది. దీంతో పోచారం ప్రాజెక్ట్స్పిల్ వేతో పాటు పైనుంచి కూడా వరద పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టు పైనుంచి నాలుగు అడుగుల ఎత్తులో వరద ప్రవహించడంతో సైడ్‌వాల్ పక్కన పెద్ద గుంత పడింది. ఇన్ని సంవత్సరాలుగా సురక్షితంగా ఉన్న ఈ ప్రాజెక్టు కొట్టుకుపోతుందేమోనని ప్రజలు, అధికారులు ఆందోళనకు గురయ్యారు. ఒక దశలో ప్రాజెక్టు కట్ట తెగిందన్న ప్రచారం కూడా సాగింది. ప్రాజెక్టు కింద ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కానీ పోచారం ప్రాజెక్టు అంత వరదనూ తట్టుకుని నిలబడింది. మరోవైపు ప్రాజెక్టు సైడ్వాల్వద్ద ఏర్పడిన గుంతను అధికారులు జేసీబీల సహాయంతో పూడ్చివేశారు.
పోచారం ప్రాజెక్టును గేట్లు లేకుండా ఓపెన్‌గా నిర్మించడం దీని ప్రత్యేకత. నిజానికి ఈ ప్రాజెక్టును 72 వేల గరిష్ట వరద సామర్థ్యంతో నిర్మించారు. ఇప్పటి వరకు అంతకు మించి ఎప్పుడూ ఆ ప్రాజెక్టుకు భారీ వరద వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది నిన్న ఈ ప్రాజెక్టుకు 1.82 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలుస్తోంది. అంటే రెండింతలకు మించి వరద వచ్చింది. అయినప్పటికీ ప్రాజెక్టు చెక్కు చెదరలేదు. అంటే ఈ ప్రాజెక్టును ఎంత పటిష్ఠంగా నిర్మించారో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయిన ఖర్చు కేవలం రూ.27.11 లక్షలు మాత్రమే.
కాగా పోచారం ప్రాజెక్టు ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతంగా విలాసిల్లుతోంది. రిజర్వాయర్సమీపంలోనే నిజాం కోట ఉన్నది. ఈ ప్రాజెక్టులో బోటు షికారు చేయడానికి కూడా తగిన వసతులు ఉన్నాయి. పోచారం ప్రాజెక్టు సమీప ప్రాంతాన్ని వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంగా గుర్తించారు. పకృతి రమణీయతకు పెట్టింది పేరైన పోచారం ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అయితే ప్రాజెక్టు ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి:సాఫ్ట్‌వేర్ అంటూ మోసం చేసిన పానీపూరీ భర్త.. గర్భవతి అని చూడకుండా దారుణంగా ఏం చేశాడంటే?