Telangana: 6 ఖండాలు, 44 దేశాలు, 154 మంది ప్రతినిధులు.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025కు హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.

New Update
Telangana Rising Global Summit

Telangana Rising Global Summit

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌-2025కు హైదరాబాద్‌ ముస్తాబయ్యింది. డిసెంబర్ 8, 9 తేదీల్లో రెండ్రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో నగర పరిధిలో పలు ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారుల్లో హైటెక్‌ ప్రొజెక్షన్లు, డిజిటల్ ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్క అమెరికా నుంచే ఏకంగా 46 మంది ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు.  

షెడ్యూల్ ఇదే 

డిసెంబర్‌ 8న మధ్యహ్నం 1.30 గంటలకు భారత్‌ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ గ్లోబల్‌ సమ్మిట్‌ను ప్రారంభించనున్నారు. ఈ సమ్మిట్‌లో అంతర్జాతీయ ఆర్థికవేత్తలు ప్రసంగిస్తారు. తొలిరోజున నోబెల్ పురస్కార గ్రహీతలు అభిజిత్‌ బెనర్జీ, కైలాశ్‌ సత్యార్థి, డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రంప్‌–మీడియా అండ్‌ టెక్నాలజీస్‌ గ్రూప్‌ నుంచి ఎరిక్‌ స్వేడర్ ప్రసంగిస్తారు. వీళ్లతో పాటు తెలంగాణ ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బయోకాన్‌ చైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించనున్నారు. 

Also Read: హైదరాబాద్‌లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు

ఇక మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం రేవంత్ ఉపన్యాసం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య పలు మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో చర్చాగోష్టులు జరుగుతాయి. ఈ సదస్సు రెండోరోజున (మంగళవారం) ఉదయం 9 గంటలకు మళ్లీ చర్చా గోష్టులు తిరిగి ప్రారంభమవుతాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా డెవలప్ చేయాలనే లక్ష్యంలో భాగంగా రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌-2047ను ఆవిష్కరించనున్నారు. అదేరోజు సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని పార్టీల నుంచి నేతలను ఈ సదస్సుకు ఆహ్వానించనుంది రేవంత్ సర్కార్.  

అయితే ఈ సమ్మిట్‌ రాజకీయ కార్యక్రమం కాదని.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు జరుగుతున్న సదస్సు అని శనివారం భట్టివిక్రమార్క మీడియా సమావేశంలో వెల్లడించారు. అందరూ కూడా ఈ సదస్సుకు సహకరించి సక్సెస్ చేయాలని కోరారు. అయితే సదస్సులో వచ్చిన ఒప్పందాలు, పెట్టుబడులు వివరాలు చివరిరోజున వెల్లడిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 

Also Read: పంచాయతీ ఎన్నికలపై కీలక అప్‌డేట్

ఇదిలాఉండగా రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమవ్వడం కోసం నగరంలో పలు ప్రాంతాల్లో డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. దుర్గం చెరువులో స్పెషల్ అట్రాక్షన్‌గా గ్లోబ్‌ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్ సమిట్‌ లోగోను ఇన్‌లిట్‌ టెక్నిక్‌తో ప్రదర్శించనున్నారు. అలాగే హుస్సేన్‌సాగర్‌లో వాటర్‌ ప్రొజెక్షన్‌తో భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మహిళా సాధికారత, యువతరైతు ప్రధాన కార్యక్రమాలు, అలాగే 3 ట్రిలియన్ ఎకానమీ టార్గెట్‌ లాంటి అంశాలను ప్రదర్శించనున్నారు

అలాగే శంషాబాద్‌ విమానశ్రయం నుంచి సమిట్‌ వేదిక వరకు వెళ్లే రోడ్‌పై భారీ డిజిటల్ LED స్క్రీన్లను ఏర్పాట్లు చేశారు. దీనిపై భారత్‌ ఫ్యూచర్‌ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంతదూరం అనే వివరాలు చూపించనున్నారు. ఫ్యూచర్ సిటీ ప్లాన్, డిజిట్ స్క్రీన్లపై విజువల్స్, అలాగే సమిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు.   

Advertisment
తాజా కథనాలు