Governor Tamilisai Soundararajan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో (Nampally Public Gardens) గవర్నర్ తమిళిసై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గవర్నర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), సీఎస్ శాంతికుమారి, అధికారులు స్వాగతం పలికారు. అలాగే పోలీసులు, సైనికుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశం దేశ రాజ్యాంగం ఎంతో మహోన్నతమైనదని.. మన రాజ్యాంగ నిర్మాతలు ఎంతో ముందుచూపు వ్యవహరించి దాన్ని తయారుచేశారన్నారు.
Also Read: ఆగస్టు 15 – జనవరి 26 జెండా ఎగురవేయడంలో ఈ తేడా గమనించారా?
అలా చేస్తే ప్రజలు ఊరుకోరు
' అన్ని వర్గాల ఆశలు, ఆశయాల సాధనకు దేశ రాజ్యాంగం తోడ్పడింది. భిన్న జాతులు, మతాలు, కులాల సమహారమే భారత్. అందినీ ఐక్యం చేసి ఒకే జాతిగా నిలబెట్టిన ఘనత రాజ్యాంగానిదే. బడుగు బలహీన వర్గాల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యాంగ మార్గదర్శకత్వంలో ముందుకు సాగడం అనేది గర్వించే విషయం. రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. పోరాటాలు, తీర్పుల వల్ల అధికారాన్ని అప్పగించే శక్తి వారికి ఉంది.
పునర్నిర్మించుకుంటున్నాం
రాజ్యాంగం ఇచ్చిన హక్కల వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గడిచిన పదేళ్లలో రాజ్యాంగ స్పూర్తికి భిన్నంగా పాలకులు రాష్ట్రాన్ని పాలించారు. నియంతృత్వ ధోరణితో వెళ్తే తెలంగాణ సమాజం సహించదు. ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా నియంతృత్వ ధోరణికి చరమగీతం పాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. విధ్వంసానికి గురైనటువంటి వ్యవస్థలను మళ్లీ నిర్మించుకుంటున్నామంటూ' గవర్నర్ అన్నారు.