Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే..

తెలంగాణ ఎన్నికలు రాజకీయ నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుందా? అని ఏపీలో ప్రధాన పార్టీల నేతలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీనే గెలవాలని టీడీపీ భావిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది.

New Update
Telangana Elections: తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో నాయకులకు ఉక్కపోత.. ఎందుకంటే..

Telangana Elections 2023: డిసెంబర్‌ 3.. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు. ఈరోజు గురించి అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే.. కేవలం తెలంగాణ ప్రజలే కాదు.. ఏపీలోనూ తెలంగాణ ఫలితాలు(Telangana Election Results) ఎలా ఉండబోతున్నాయనే ఆతృత కనిపిస్తోంది. గత 15, 20 రోజులుగా తమ రాజకీయ కార్యకలాపాలను పక్కనపెట్టి మరీ తెలంగాణ ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు ఏపీ నేతలు. ఇంతకీ ఏపీ నేతల ఎదురుచూపులకి కారణం ఏంటి? తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీ రిజల్ట్స్‌ ఆధారపడి ఉన్నాయనే ప్రచారంలో నిజం ఎంత? ప్రత్యేక కథనం మీకోసం..

తెలంగాణ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారంతో హోరోత్తించారు. ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలతో పాటు.. అధికారంలోకి వస్తే.. ప్రజల కోసం అమలు చేసే పథకాలతో హామీల వర్షం కురిపించారు. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. చాలా చోట్ల టఫ్‌ ఫైటింగ్‌ ఉండటంతో అధికారంలోకి ఎవరొస్తారన్న టెన్షన్‌ కనిపిస్తోంది. హ్యాట్రిక్‌ కొట్టాలని భావిస్తున్న బిఆర్ఎస్ ఒకవైపు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా మొదటిసారి బోణి కొట్టాలని చూస్తున్న కాంగ్రెస్ మరోవైపు.. ఇక తెలంగాణలో ఖాతా తెరవాలని భావిస్తున్న బీజేపీ కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. మరి తెలంగాణ ప్రజలు ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారు? అన్నది ఉత్కంఠ రేపుతోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీ నేతల్లో టెన్షన్‌ ఉండటం సహజమే. కానీ.. ఎన్నికల ఫీవర్‌ తెలంగాణ కంటే ఏపీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. తెలంగాణలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? అనే ఉత్కంఠ వాతావరణం ఏపీ రాజకీయాల్లో కనబడుతుంది. ముఖ్యంగా ఏపీలోని అధికార, ప్రతిపక్షాలు తెలంగాణ ఫలితం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ఎన్నికల ఫలితాలు.. ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోని వైసీపీకి, కాంగ్రెస్ గెలిస్తే టీడీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని బహిరంగానే చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఆ రెండు పార్టీల కోసం.. ఇక్కడ పార్టీల నేతలు సహాయ సహకారాలు అందిస్తున్నారనే చర్చ నడుస్తుంది. కాంగ్రెస్ కోసం టీడీపీ పనిచేస్తోందని, రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసేందుకు టీడీపీ డబ్బులు కూడా పంపుతోందనే ఆరోపణలు చేస్తోంది వైసీపీ. కాంగ్రెస్‌ను గెలిపించేందుకే తెలంగాణ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు బహిరంగంగానే ఆరోపణలు చేశారు.

ఇక తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే.. ఏపీలో వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతోంది. 2019 ఎన్నికల్లో సీఎం కేసీఆర్.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వేలు పెడతానని.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎన్నికల ముందు ప్రకటించారు. అంతేకాదు ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఈసారి తెలంగాణలో బీఆర్ఎస్ వస్తే.. ఏపీలో వైసిపికి కొంత అనుకూలత ఉండే అవకాశం ఉందనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతుంది.

మొత్తానికి తెలంగాణ ఎన్నికల ఫీవర్ ఏపీలో ఏ స్థాయిలో ఉందంటే.. ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ తమ కార్యకలాపాలను పక్కనపెట్టి మరీ తెలంగాణ ఫలితాల కోసం ఎదురు చూసే స్థాయికి వెళ్ళింది. దీనిలో భాగంగానే మూడు వారాలకు పైగా ఏపీలో రాజకీయ కార్యకలాపాలు పెద్దగా ఉండడం లేదు. వైసీపీ బస్సు యాత్ర మినహాయించి ఏపీలో రాజకీయ పార్టీలు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి టీఆర్ఎస్ కూడా ఒక కారణమనే కసి, కోపం ఏపీలోని టీడీపీ నేతల్లో ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా.. 2019లో బీఆర్ఎస్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్‌ను రేపు చంద్రబాబు కూడా ఇస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే.. ఏపీలో టీడీపీ విజయం నల్లేరు మీద నడకనే అని కొందరు భావిస్తున్నారు. మరి ఎవరి అంచనాలు నిజం అవుతాయో, తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే డిసెంబరు 3వ తేదీ వరకు ఆగాల్సిందే.

Also Read:

ఎన్నికల కురుక్షేత్రంలో గులాబీ బాస్ దూకుడు.. 96 సభలతో ప్రచార హోరు..

తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..

Advertisment
తాజా కథనాలు