ఒక్క దెబ్బకు రెండు పిట్టల్లా ఇటు తెలంగాణ కాంగ్రెస్ అద్యక్షుడు రేవంత్‌రెడ్డిపైనా అటు ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపైనా షర్మిల పరోక్షంగా అస్త్రాలు సంధించారు. రాజకీయంగా ఆమె టార్గెట్ ఎవరో సంకేతమిచ్చారు. ఓట్లు సీట్ల బలం లేదని తెలిసినా తన మాటలతో చేతలతో రాజకీయ వివాదాలు, సంచలనాలు సృష్టించిన శైలి మరోసారి ప్రదర్శించారు.
తాను పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకుండా ఎవరో అడ్డుపడ్డారని షర్మిల చేసింది తీవ్ర ఆరోపణే. ఇప్పటివరకూ ఈ అంశంపై స్పందించని స్వాగతించని రేవంత్ రెడ్డి అందరికీ గుర్తు వస్తారు. ఇక దొంగలు ముఖ్యమంత్రులు కాకూడదన్న మాట ఎవరికి నచ్చినట్టు వారు వర్తింపజేసుకోవచ్చు. కానీ సుప్రీం కోర్టు దోషిగా నిర్ధారించిందన్న మాటను బట్టి ఇదీ రేవంత్‌కే తగులుతుంది. తాను బలపర్చే పార్టీ రాష్ట్ర అద్యక్షునిపై ఇంత మాటనడం విపరీతమే. ఇక వైఎస్‌పై ఛార్జిషీటు వేసి జగన్ ను జైలుకు పంపిన కాంగ్రెస్‌కు మద్దతివ్వడం పార్టీనేతగా షర్మిల సొంత విషయమనీ తమకు సంబంధం లేదని వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అనడంపైనా తీవ్రంగానే దాడి చేశారామె. తమ పార్టీతో సంబంధం లేదన్న వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఎదురు ప్రశ్న వేయడమే కాకుండా.. అంటే సంబంధం వుందని ఒప్పుకుంటున్నారా అని కూడా లాజిక్ తీశారు. ఎవరో విలేకరి ప్రస్తావనను ఆధారం చేసుకుని ఎవరికైనా ఇదే జవాబని చెప్పడం పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించినట్టు భావించే అవకాశముంది. ఇప్పటివరకూ వివేకానందరెడ్డి హత్యకేసులో తప్ప మరే సందర్భంలోనూ ఏపీ విషయాలపై నోరు విప్పని షర్మిల నేరుగానే వైసీపీపై అధినేతపై స్పందించడం కొత్త పరిణామమే. తెలంగాణలో పార్టీ పెట్టడమే గాని ఇక్కడ ఆమె ఏదో పెద్ద ప్రభావం చూపగలరని ఎవరూ అనుకోలేదు. కాకపోతే జగన్ చెల్లెలిగా తన మాటకు ఏపీ కోణంలోనే ఆకర్షణా, ఆసక్తి వున్నాయి. టీడీపీని బలపర్చే ఒక మీడియా ఈ కోణంలోనే విస్తారమైన కథనాలు ఇచ్చింది.
ఈ రోజు తన మాటలతో షర్మిల ఏపీ రాజకీయ రంగ ప్రవేశంచేశారని భావించవచ్చునా? ఇది ఆరంభమా అనుకోని ప్రస్తావనా? త్వరలోనే తెలుస్తుంది. కాకుంటే ఆమె నిర్ణయాలను ఇప్పటికే బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణ ద్రోహుల జాబితాలో చేర్చి మాట్లాడుతున్నారనేది తెలిసిన విషయమే. ఆమె రేవంత్‌పై దాడి చేశారు గనక ఇప్పుడు వారి మాట మారే అవకాశముందా? కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది? చూడాలి మరి..!
Also Read: కాంగ్రెస్ హవా నిజమవుతుందా?
WATCH: