Revanth Reddy as Telangana CM?: కాంగ్రెస్ ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ఏమాత్రం సమయం తీసుకోకుండా చర్చలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే సోమవారం ఉదయమే గచ్చిబౌలీలోని ఎల్లా హోటల్ లో సీఎల్పీ (CLP Meeting) మీటింగ్ నిర్వహిస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar) పార్టీనేతల వెంటే ఉంటూ దిశనిర్దేశం చేస్తున్నారు. సీనియర్ నేతలతో కీలక సమావేశాలు నిర్వహిస్తూ తెలంగాణ కేబినెట్ కూర్పు వ్యవహారంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే నిజానికి సీఎల్పీ సమావేశం సోమవారం ఉదయం 9.30 గంటలకే జరగాల్సి ఉండగా డీకే శివకుమార్ సీనియర్ నేతలతో ఈ చర్చలు చేయడంతో కాస్త ఆలస్యంగా మెదలైంది. కొంతమంది ఎమ్మోల్యేలు కూడా ఈ మీటింగ్ కు ఆలస్యంగా రావడంతో లేట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ సీఎల్పీ సమావేశంలో గెలిగిన 64 మంది ఎమ్మోల్యేలతోపాటు రాహుల్ గాంధీ, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇన్‌ఛార్జి ఠాక్రే, మాజీ ఎంపీ మల్లురవిలు పాల్గొన్నట్లు సమాచారం. కాగా ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ తర్వాతే సీఎం ఎవరనే నిర్ణయంపై క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో కర్ణాటకలో జరిగినట్లే తెలంగాణలోనూ పార్టీ నాయకులందరి సమక్షంలో సమావేశం నిర్వహించి, మెజారిటీ ఆధారంగా ముఖ్యమంత్రిని ప్రకటించబోతున్నట్లు పలువురు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు.
Also read :BJP in MP: ఏ మాత్రం ఆశలు లేని మధ్యప్రదేశ్ లో బీజేపీ విజయం ఎలా సాధ్యం అయింది?
ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగితే సోమవారం సాయంత్రంలోగా ముఖ్యమంత్రిని ప్రకటించనున్నారు. ఇందులో భాగంగానే 300 మంది ముఖ్య నాయకుల కోసం ఏర్పాట్లు చేయాల్సిందిగా రాజభవన్ కార్యాలయానికి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా పార్టీ వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలను బట్టి సోమవారమే ప్రమాణ స్వీకారం చేసేలా కనిపిస్తోంది. ఈ సాయంత్రం లోగా అన్నీ సవ్యంగా జరిగితే సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం ఉండబోతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎల్పీ నేత ఎంపిక పూర్తవగానే నివేదికను అధిష్ఠానానికి పంపనున్నారని, ఆ తర్వాత కాంగ్రెస్ బృందం గవర్నర్‌ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6 లేదా 9న మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశముండగా మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విజయోత్సవ సభగా నిర్వహించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ (Rahul Gandhi), ప్రియాంక తదితరులు హాజరుకానున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy), కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముఖ్యమంత్రి రేసులో ఉండగా అందరిచూపు రేవంత్ వైపే ఉంది. మెజారిటీ ప్రజలు కూడా రేవంత్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.