Telangana Elections 2023: కరీంనగర్ ను చలికాలంలో రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అవినీతి చేయడం వల్లే నీ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిందని తనపై మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
ALSO READ: ఆడపిల్ల పుడితే రూ.2 లక్షలు, విద్యార్థినులకు ఉచిత స్కూటీ..
ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ మాట్లాడుతూ.. గంగుల…. నీలెక్క గుట్టలు మాయం చేశానా?, భూకబ్జాలు చేశానా? పేదల ఇండ్లు కూల్చి సంపాదించానా?, కరప్షన్ తెలంగాణలోనే కరీంనగర్ టాప్ అని నిఘా నివేదికలే చెబుతున్న సోయి లేదా?, తెలంగాణలో అత్యంత అవినీతిపరుడివి నువ్వే అంటూ ఫైర్ అయ్యారు.
నేను అధికారంలోనే లేను, నిరంతరం పోరాటాలే చేసిన.. నేను అవినీతిపరుడినైతే…. జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చి ఎట్లా గౌరవిస్తారు? అని మంత్రి గంగులను బండి సంజయ్ విమర్శించారు. అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరు. హెలికాప్టర్ ఇవ్వరు. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వరు.. మోదీగారు అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెస్తడని తెల్వదా?’’ అని నిలదీశారు.
ALSO READ: రైతులకు 2 లక్షలు.. అమ్మాయి పెళ్లికి లక్ష, తులం బంగారం..
మోదీ ప్రభుత్వం 2 లక్షల 40 వేల ఇండ్లు మంజూరు చేయిస్తే కేసీఆర్ (KCR) ప్రభుత్వం వాటిని ప్రజలను కట్టివ్వలేదని అన్నారు. ఆ ఇండ్లు కట్టిస్తే… తెలంగాణకు మరో 5 లక్షల ఇండ్లు మంజూరు చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదని బండి ఆరోపించారు.
ఈసారి ఎన్నికల్లో గంగుల ఓడిపోవడం ఖాయమని, మూడోస్థానానికి పడిపోతున్నాననే భయంతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నడని పేర్కొన్నారు. లక్ష సెల్ ఫోన్లు, ఓటుకు రూ.10 వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నడని ఆరోపించారు. నేను ప్రజలను నమ్ముకున్న. ధర్మాన్ని నమ్ముకున్న. ప్రజల కోసం పోరాడి జైలుకు వెళ్లిందెవరు? కుటుంబం కోసం వందల కోట్లు దిగమింగిందెవరో మీరే ఆలోచించండి అని ప్రజలను కోరారు.