Telangana Elections: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress) పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. ఎవరైతే పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు దోహదపడుతారని ప్రచారానికి ఆహ్వానించారో.. వారే పార్టీ పుట్టి ముంచే వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్‌గా రంగంలోకి దిగిన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(DK Shiva Kumar).. రాష్ట్ర కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చేలా కామెంట్స్ చేశారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. కర్ణాటకలో తమ ప్రభుత్వం వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ ఇస్తోందని ప్రకటించారు. ఓవైపు బీఆర్ఎస్‌కు ధీటుగా.. తాము కూడా 24 గంటల విద్యుత్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తుంటే.. డీకే మాత్రం తాము 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, అదే గొప్పగా చెప్పడం ఇప్పుడు సంచలనానికి దారి తీసింది.
తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగిన విధంగా వ్యూహ ప్రతివ్యూహాలు సిద్ధం చేస్తోంది. పార్టీకి ప్రచారం కోసం జాతీయ స్థాయి నేతలను రంగంలోకి దించుతోంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. శనివారం తాండూరులో నిర్వహించిన విజయభేరి కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ఆయన.. తీవ్ర సంక్షోభంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో రైతులకు 5 గంటల విద్యుత్ ఇస్తుందన్నారు. దానిని 7 గంటలకు పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. కానీ, కేసీఆర్ మాత్రం 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారంటూ ఆరోపించారు. ఈ కామెంట్సే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతలను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి.
ఇప్పటికే తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ కూడా అదే హామీ ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తోంది. ఇంతలో.. తాము కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని డీకే ప్రకటించడంతో.. కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. డీకే వ్యాఖ్యలు తమకు నష్టం కలిగిస్తాయనే ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి.
ఛాన్స్ తీసుకున్న బీఆర్ఎస్..
తాండూరు వేదికగా డీకే శివకుమార్ చేసిన 5 గంటల విద్యుత్ ప్రకటనను బీఆర్ఎస్ తనకు అవకాశంగా మలుచుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ వస్తే 3 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తుందని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ప్రచారం చేస్తుంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా.. ఈ ఆరోపణలకు డీకే కామెంట్స్ తోడయ్యాయి. ఇంకేముంది.. మీడియా ముఖంగా, సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అని, డీకే వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అసలు రూపం బయటపడిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. డీకే చేసిన కామెంట్స్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Also Read:
కాంగ్రెస్‌లో వారికి జాక్‌పాట్.. పార్టీలో చేరడమే ఆలస్యం టికెట్ల కేటాయింపు..
సీఎం జగన్ పథకాలపై జేడీ లక్ష్మీనారాయణ పొగడ్తల వర్షం.. ఫుల్ ఖుషీలో వైసీపీ ఫ్యాన్స్..