బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మృతి అందరినీ తీవ్ర బాధలోకి నెట్టేసింది. మృతి వార్త తెలిసి సీఎంతో సహా అందరు నేతలూ స్పందిస్తున్నారు. ఎమ్మెల్యే లాస్య నందిత మరణం తీవ్ర బాధను కలిగించిందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని చెప్పారు. లాస్య ఇంటికి వెళ్ళి ఆమె కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఆమె మృతికి సంతాపాన్ని తెలియజేశారు. లాస్య నందిత ఇంత చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని అన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాని తెలిపారు. వీరితోపాటూ మంత్రి ఉత్తమ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు కూడా లాస్య మృతికి సంతాపం తెలియజేశారు.
కేసీఆర్ దిగ్భ్రాంతి...
బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. లాస్య అకాల మరణం బాధాకరం అని...ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఇక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ లాస్యతో గత వారం కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలు ఇవే అంటూ వాటిని ఎక్స్‌లో పంచుకున్నారు. దాంతో పాటూ మంచి నేతగా ఉన్న యువ ఎమ్మెల్యేని కోల్పోవడం తీవ్ర నష్టమని..ఈ భయంకరమైన, క్లిష్ట సమయంలో ఆమె కుటుంబం, స్నేహితులకు బలం చేకూర్చాలని నా హృదయపూర్వక ప్రార్థనలు అని అన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు అమేధా ఆసుపత్రికి చేరుకున్నారు. లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీజేపీ నేతల సంతాపం..
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాలమరణం పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారి సంతాప సందేశం పంపించారు. చిన్న వయసులో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను అన్నారు. గతంలో కార్పొరేటర్ గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా.. రాజకీయాల్లో చాలా చురుకుగా ఉండే లాస్యనందిత మంచి భవిష్యత్తున్న నాయకురాలని కొనియాడారు. ఇక కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల తీవ్రదిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు ఈటల రాజేందర్. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. చిన్నవయసులోనే లాస్య నందిత మరణించడం బాధాకరమని అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్. లాస్య ఆత్మకు శాంతి కలగాలని, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
స్పందించిన చంద్రబాబు నాయుడు..
లాస్య నందిత మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని బాధను వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఎమ్మెల్యేగా ఆమె ఎంతో సాధించాల్సి ఉందని..కానీ విధి మరోలా తలచిందని ఆయన అన్నారు. వాళ్ళ నాన్నగారు మృతి చెందిన ఏడాదికే లాస్య కూడా మరణించడం విచారకరమన్నారు చంద్రబాబు.
Also Read:Maharastra: మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత