Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు!

తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడించేలా ఆషాఢ బోనాలు నిర్వహించాలని దేవాదాయ & ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ అధికారులకు సూచించారు. గతంలో కంటే వైభవోపేతంగా ఆషాఢ జాతరలో ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసేలా పండుగ నిర్వహిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు.

Telangana Bonalu: జూలై 7 నుంచి తెలంగాణలో బోనాలు.. ఏర్పాట్లపై మంత్రుల కీలక ఆదేశాలు!
New Update

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ యేడాది జూలై 7 నుండి 29 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. సోనియాగాంధీ ప్రసాదించిన తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని ఈ జాతరతో ప్రపంచానికి చాటుతామని అన్నారు. GHMC పరిధిలోని అన్ని జిల్లాల్లో నెలకొన్న 3 వేలకు పైగా దేవాలయాలకు బోనాల జాతర నిర్వహణ నిమిత్తం 25 కోట్ల రూపాయల గ్రాండ్ ఎయిడ్‌ను అందించాల్సిందిగా సీఎం ని కోరామని, మరో రెండు మూడు రోజుల్లో ఈ నిధులు విడుదలైన వెంటనే దేవాలయాల అలంకరణ, సౌకర్యాల కల్పన పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.కార్యక్రమంతో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులు జాతర ముగిసే దాకా సంకల్పబలంతో పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు.

publive-image

MCHR లో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ హన్మంత రావు పాల్గొన్నారు.  వీరితో పాటూ దేవాదాయ శాఖ, జిహెచ్ఎంసి, ఆర్ అండ్ బి, పోలీస్, ట్రాన్స్ కో, టిజిఆర్టిసి & రైల్వే, ఐ అండ్ పిఆర్, హెచ్ఎండబ్ల్యుఎస్ & ఎస్ బి, సివిల్ సప్లైస్, పురావస్తు, వైద్యారోగ్యశాఖ, సాంస్కృతికశాఖ, మెట్రో రైల్, క్యురేటర్(అటవీశాఖ), అగ్నిమాపక శాఖకు చెందిన ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

publive-image

బోనాలు ముగిసేదాకా అన్ని శాఖలు అంతర్గత సమావేశాలతో పాటు, ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుకుంటూ, జాతర పనులను సకాలంలో పూర్తి చేసి, విజయవంతంగా జాతరను ముగించాలని మంత్రి సురేఖ అధికారులను ఆదేశించారు. బోనాల జాతరకు తెలంగాణలోని పలు జిల్లాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో ఈ సంఖ్య మరింత పెరగనున్నందున అదనపు బస్సులు కేటాయించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి కోరారు.

జాతర నేపథ్యంలో జనసంచారాన్ని దృష్టిలో పెట్టుకొని రెప్పపాటు కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. బస్ స్టాండుల్లో తాగునీరు, చిన్న పిల్లలకు ఆహారం, వైద్య సదుపాయం కల్పించే దిశగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగు అంబారీ పై ఊరేగింపు నిమిత్తం కర్నాటక నుంచి ఏనుగు తీసుకువస్తున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.

వర్షాకాలం నేపథ్యంలో విపత్తు నిర్వహణ విభాగం వేగంగా స్పందించాలని మంత్రి సురేఖ ఆదేశించారు. అగ్నిమాపక శాఖ కేవలం తమ సిబ్బందినే కాకుండా వాలంటీర్లకు శిక్షణను ఇచ్చి దేవాలయాల వద్ద సేవల్లో వినియోగించుకోవాలని సూచించారు. మహిళలు పెద్ద ఎత్తున జాతరలో పాల్గొంటారు కాబట్టి షీ టీమ్స్ అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. ప్రజల సౌకర్యం నిమిత్తం బోనాల జాతర సందర్భంగా ఆయా దేవాలయాల్లో జరిగే ఉత్సవాలతో కూడిన క్యాలెండర్ ను విడుదల చేస్తామని తెలిపారు. దేవాలయ కమిటీలతో త్వరలోనే మీటింగ్ నిర్వహించి జాతర ఏర్పాట్లను పూర్తి స్థాయిలో సమీక్షిస్తామని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. జాతరతో ముడిపడి ఉన్న అన్ని శాఖల అధికారులతో మంత్రి సురేఖ కూలంకషంగా చర్చించారు. జాతర పనులను వీలైనంత వేగంగా చేపట్టి జాతరను విజయవంతంగా చేయాలని ఆదేశించారు.

మొత్తం 28 దేవాలయాల్లో ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు తెలిపారు. వీటిలో బోనాల జాతర ప్రారంభానికి వేదికగా నిలిచే గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయం మొదలు, సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, పాతబస్తీ లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం, మీర్ ఆలం మండిలోని శ్రీ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవాలయం, శాలిబండలోని శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం, చార్మినార్ లోని శ్రీ భాగ్యలక్ష్మీ దేవాలయం, కార్వాన్ లోని శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, సబ్జీమండిలోని శ్రీ నల్లపోచమ్మ దేవాలయం, చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ దేవాలయం, మొత్తం 9 దేవాలయాలకు మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారని మంత్రి తెలిపారు.19 దేవాలయాల్లో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు గానీ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి స్పష్టం చేశారు.

జూలై 21 న సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించిన మరుసటి రోజు జూలై 22న ఉదయం 9.30 గంటలకు రంగం కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. జూలై 29న శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం నందు అంబారీ పై ఊరేగింపు ఉత్సవం అనంతరం ఘటముల ఊరేగింపు, నిమజ్జనంతో బోనాల జాతర ముగుస్తుందని మంత్రి వెల్లడించారు.

మంత్ర పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రజాస్వామిక తెలంగాణలో ప్రజలు ఈ యేడాది బోనాలను ఘనంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి అమ్మవార్ల బోనాలను విజయవంతం చేయాలని కోరారు.

Also Read:Karnataka: కన్నడ నటుడు దర్శన్‌కు షాక్..కస్టడీ పొడిగింపు

#bonalu #telangana #celebrations #festival
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe