మరికొద్ది రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల జాతర మొదలైపోయింది. అధికార, విపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో రాష్ట్ర రాజకీయాలు సెగలు పుట్టిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే ఎన్నికల్లో గట్టి పోటీ ఉండనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పార్టీ మేనిఫేస్టోను ప్రకటించారు. ఇక కాంగ్రెస్ కూడా ఆరు గ్యారెంటీల హామీని ప్రకటించేసింది. ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందని రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆ నెల 12 లేదా 13వ తేదీన కమలం పార్టీ తమ మెనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
గతంలో సీఎం కేసీఆర్ దళిత బంధును ప్రకటించి... ఒక నియోజకవర్గంలోని 100 మంది దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు దళితులను తమవైపు తిప్పుకునేందుకు.. బీఆర్‌ఎస్ 'దళిత బంధు'కు కౌంటర్‌గా బీజేపీ తమ మేనిఫెస్టోలో 'దళిత్ రత్నా' అనే పథకాన్ని ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే.. ఉద్యోగాలు ఇచ్చే వాళ్లను తయారుచేయడంపై ఎక్కువగా రాష్ట్ర బీజేపీ దృష్టిసారించిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక దళిత రత్న పథకం కింద.. దళితులు అలాగే ఇతర వర్గాలకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సహాకాలను ఇచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: కేసీఆర్ నుంచి కిషన్ రెడ్డి వరకు.. ఫస్ట్ ఎన్నికల్లో ఓటమి పాలై నేడు చక్రం తిప్పుతున్న నేతలు వీరే!
అయితే ఈ దళిత రత్న ఫథకం అనేది దళితులు సొంతంగా వ్యాపారాలు చేసుకునేలా రూ.10 లక్షలు ఇచ్చేలా ఉండదు. ఈ పథకం కింద పలు సబ్సిడీలు, ఇంకా ఇతరాత్ర ప్రోత్సహకాలు ఉండనున్నట్లు సమాచారం. దళితులు ప్రయోజనం పొందేలా ఈ పథకాన్ని తీసుకొస్తున్నామని.. తాము మేనిఫెస్టోలో ప్రకటించే అన్ని పథకాలు అమలు చేస్తామని ఓ బీజేపీ నేత తెలిపారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు సృష్టించేవాళ్లను తయారుచేసే దాని గురించి బీజేపీ కొత్తగా ఏదైనా పథకం తీసుకురానున్నట్లు సమాచారం. ఇక మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ప్రకటించే మేనిఫెస్టోల్లో కొన్ని పథకాలు ఒకేలా ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే తమ మేనిఫెస్టో దాదాపు ఖరారైపోయిందని.. ప్రస్తుతం దానిపై పరిశీలన కొనసాగుతోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.