సోషల్ మీడియా యుగం వచ్చాకా ప్రతి ఒక్కరి చేతికి మొబైల్ ఫోన్ వచ్చేసింది. అయితే చాలామంది తమ ఫోన్ పట్ల అజాగ్రత్త వహించి ఎక్కడో ఓ చోట ఫోన్ పోగొట్టుకుంటారు. ఆ తర్వాత ఆ ఫోన్ ఆచూకి కోసం అనేక తిప్పలు పడుతుంటారు. చివరికి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కూడా అది దొరికే ఛాన్స్ ఉండొచ్చు లేకపోవచ్చు. అలాగే చాలావరకు దొంగలు కూడా రద్దీగా ఉన్న ప్రదేశాలను లక్ష్యంగా చేసుకోని ఫోన్స్ కొట్టేస్తుంటారు. అయితే పోగొట్టుకున్న, దొంగతనాలు చేసిన ఫోన్లను రికవరీ చేయడంలో దేశంలోనే తెలంగాణ సీఐడీ పోలీసులు మొదటిస్థానంలో నిలిచి రికార్డు సృష్టించారు.189 రోజుల్లోనే పొగొట్టుకున్న, చోరీకి 10,018 మొబైల్ ఫోన్లను సీఐడీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: కేసీఆర్‌ను ఓడించే మొగోడు రేవంత్ రెడ్డి.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్..
ఈ ఫోన్లను స్వాధీనం చేసుకున్న అనంతరం యజమానులకు అధికారులు తిరిగి ఇచ్చారు. చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను కనిపెట్టేందుకు అమల్లోకి తీసుకొచ్చిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టార్) పోర్టల్ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 780 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కొత్త పోర్టల్ విధానాన్ని డీజీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ముందుగా 60 మంది ట్రైనర్లకు ఈ పోర్టల్ వాడకంపై ట్రైనింగ్ ఇచ్చారు. అనంతరం పూర్తిస్థాయిలో ఏప్రిల్ 20 నుంచి ఈ సీఈఐఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలోకి అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి కూడా ఈ పోర్టల్ విధానంతోనే చోరీకి గురైన ఫోన్లను రికవరీ చేస్తున్నారు పోలీసులు. ఇక బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు సుమారు 16,011 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ విధానంలో బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు. ఇకనుంచి ఎవరైనా ఫోన్లు పోగొట్టుకుంటే దగ్గర్లోని మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లి సీఈఐఆర్ విధానంలో కంప్లైట్ చేయొచ్చని పోలీసులు సూచనలు చేస్తున్నారు.