TS JOBS : తెలంగాణ(Telangana) నిరుద్యోగులకు కాంగ్రెస్(Congress) గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ 2024లో అధికారంలోకి వస్తే మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఎన్నికల ముందు చెప్పినట్లుగానే జాబ్ క్యాలెండర్ అమలుకు సంబంధించి తేదీల వారిగా నియమాకాల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
20 వేల ఉద్యోగాల భర్తీ..
ఇక ఇప్పటికే పలుసార్లు వాయిదాపడిన గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో హాస్టల్ వార్డెన్, డీఎస్సీ, జూనియర్ లెక్చరర్లు, వైద్య ఆరోగ్య శాఖ, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు ఫిబ్రవరి 1న గ్రూప్-1 కు సంబంధించి అపాయింట్ మెంట్స్ ఫిల్ చేయనుండగా.. ఇదే నెలలో వివిధ శాఖల్లో 20 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇక గ్రూపు-1 ఉద్యోగాల కోసం 2024 ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ విడుదల చేస్తామని వెల్లడించింది. గ్రూపు-2 ఉద్యోగాల నోటిఫికేషన్ 2024 ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు తెలిపింది. గ్రూపు-3 నోటిఫికేషన్ జూన్1, డిసెంబరు 1న రెండు విడతలగా విడుదల చేస్తామని నేతలు చెబుతున్నారు. గ్రూపు-4 నోటిఫికేషన్ జూన్ 1, డిసెంబరు 1న రెండు విడతలుగా విడుదల చేయాలని నిర్ణయించామని వెల్లడించింది.
యూపీఎస్సీ ఛైర్మన్ తో భేటీ..
ఇందులో భాగంగానే ఇటీవల యూపిఎస్పీ(UPSC) ని కలిసిన రేవంత్(Revanth) బృందం.. యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ(TSPSC)ని పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించాలని యూపీఎస్సీ ఛైర్మన్ మనోజ్ సోనిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సోని.. ఆ మేరకు సాయం చేస్తామన్నారు. అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పూర్తిస్థాయి ప్రక్షాళన చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ హయాంలో టీఎస్‌పీఎస్సీ లో చోటు చేసుకున్న ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మోడల్‌ను ప్రవేశపెట్టడంపై రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. టీఎస్‌పీఎస్సీలో ప్రక్షాళన కోసం యూపీఎస్సీ సహకారాన్ని తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి వర్గ సహచరుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి యూపీఎస్‌సీ ఛైర్మన్ డాక్టర్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్సీ గురించి చర్చించారు. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న లోటుపాట్లు, తప్పొప్పులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జాబ్ నోటిఫికేషన్లను వెలువడించడం గానీ, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించడంలో గానీ, వాటి ఎవాల్యుయేషన్‌లో గానీ తమకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి : Telangana: రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం
యూపీఎస్‌సీ తరహాలోనే టీఎస్‌పీఎస్‌సీ..
అలాగే ఉద్యోగాల భర్తీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. టీఎస్‌పీఎస్‌సీలో జరిగిన తప్పులపై మాట్లాడుతూ.. గతంలో టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని, ఇకపై రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండకుండా జాగ్రత్త పడతామని అన్నారు. యూపీఎస్‌సీ తరహాలోనే టీఎస్‌పీఎస్‌సీని కూడా రూపొందిస్తామని చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు.
ఇక గ్రూపు పరీక్షలతో పాటుగా 13 విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగాలను సైతం భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదని మేనిఫెస్టోలో పేర్కొంది.