ప్రపంచకప్ అయిపోయి చాలా రోజులు అవుతున్నా ఆ బాధ మాత్రం ఇంకా తీరడం లేదు. టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అయితే దాన్ని అస్సలు మర్చిపోలేకపోతున్నారు. ఇన్నాళ్ళు అసలు బయటకు కూడా కనిపించకుండా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి రోహిత్ శర్మ తొలిసారిగా స్పందించాడు. ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణనను బయటపెట్టాడు. కోట్లాది మంది మనసులను గాయం చేసిన ఫైనల్ మ్యాచ్ మీద ఇప్పుడు నోరు విప్పి మాట్లాడాడు హిట్ మ్యాన్. ఆ ఓటమి నుంచి కోలుకుని ముందుకెళ్లడం చాలా కష్టమైందని.. ఫైనల్ మ్యాచ్ తర్వాత తాను ఎదుర్కొన్న సంఘర్షణ మామూలుది కాదని అంటున్నాడు. ఆ సమయంలో మొత్తం భారతజట్టుకు మద్దతుగా నిలిచిన అభిమానులకు రోహిత్ శర్మ కృతజ్ఞతలు తెలియజేశాడు.
Also Read:ఏపీలో వైసీపీదే హవా…టైమ్స్ నౌ ఈటీజీ సర్వే
ఓటమి నుంచి ఎలా బయటపడాలో కొన్ని రోజులు నాకు అర్ధం కాలేదు అని చెబుతున్నాడు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. నా కుటుంబం, స్నేహితులు, నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు అందరూ దానిని మరిచిపోయేలా చేసేందుకు చాలా సాయపడ్డారు. ఆ విషయాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేం. కానీ మర్చిపోయి ముందుకెళ్లడమే జీవితం. అయితే అది చాలా కష్టమైన పని. చిన్నప్పటి నుంచి ప్రపంచకప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగా. ఫైనల్ మ్యాచ్ గెలవడమే అన్నింటికంటే గొప్ప బహుమతి. మేము దాని కోసం కొన్నేళ్ళు కృషిచేశాము. కానీ అన్నిరోజులు దేనికోసమైతే కష్టపడ్డామో అది దొరకనప్పుడు, దేనికోసమైతే కలలు కన్నామో అది నెరవేరనప్పుడు నిరాశ కలుగుతుంది. అసహనం కూడా వస్తుంది. నా మీద నాకే చాలా కోపం వచ్చింది అని చెప్పుకొచ్చాడు రోహిత్.
వరల్డ్ కప్ గెలిచేందుకు టీమ్ మొత్తం చాలా కష్టపడింది. ఫైనల్ మ్యాచ్ లో ఏం తప్పు జరిగింది అంటే..నేను చెప్పగలిగేది ఒక్కటే మాట. మేము మా శాయశక్తులా కష్టపడ్డామని. అన్ని మ్యాచ్ లలోనూ తప్పులు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాం. ప్రపంచకప్ ఫైనల్ వరకూ మేము ఆడిన ఆట.. ప్రజలకు సంతోషాన్ని, గర్వాన్ని ఇస్తుందని అనుకుంటున్నా అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.