TG Education: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు త్వరలోనే కళకళలాడనున్నాయి. విద్యార్థులకు సరిపడా టీచర్లు లేక బోసిపోయిన క్లాస్ రూముల్లో ఇకపై నిరంతరం పాఠ్యాంశాల బోధన జరగనుంది. విద్యావ్యవస్థపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన రేవంత్ సర్కార్.. త్వరలోనే కొత్త టీచర్లను నియమించేందుకు కసరత్తులు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే నిరసనలను పట్టించుకోకుండా డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం.. తాజాగా అన్ని డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీ లను విడుదలచేసింది. దీంతోపాటు ఇంటర్మీడియెట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీ ప్రక్రియను మొదలుపెట్టింది.
ఆగస్టు నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి..
ఈ మేరకు వీలైనంత త్వరగా ఆగస్టు నెలాఖరులోగా అన్ని పరీక్షల ఫలితాల ప్రక్రియను పూర్తిచేసి రెండు నెలల్లోనే టీచర్, లెక్చరర్ల నియామకాలు చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో ఖాలీగావున్న 1.392 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. పరీక్ష ఫలితాలనూ ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నడుస్తోండగా.. త్వరలోనే ఈ రిక్రూట్ మెంట్ పూర్తికానుంది. మల్టీ జోన్ 1 పరిధిలో 724 మంది, మల్టీజోన్ 2లో 668 మంది అధ్యాపకులను నియమించనుంది. ఇక పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 మందికి త్వరలోనే నియామక పత్రాలూ అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Ration cards: స్మార్ట్ కార్డుగా మారనున్న రేషన్ కార్డులు.. స్వైప్ చేస్తేనే సరుకులు!
ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మొత్తం 544 ఖాళీలను భర్తీ చేయనుండగా.. 491 డిగ్రీ లెక్చరర్లు, 29 పీడీ, 24 లైబ్రరియన్ పోస్టులున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన 5,089 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ను రద్దు చేసిన రేవంత్ సర్కార్.. 11,062 టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే.. సింగిల్ టీచర్ తో నడిచే పాఠశాలలను మూసివేయబోతున్నట్లు తెలుస్తోంది.