Ap Politics: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మాజీ మంత్రులు , మాజీ ఎమ్మెల్యేల పై వరుసగా పోలీసు కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వేర్వేరు కారణాలతో జైలులో ఉన్న విషయం తెలిసిందే. మరి కొందరి పై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా మాజీ సీఎం జగన్ పేరు కూడా ఎఫ్‌ఐఆర్ లో నమోదు అయ్యింది.
ఈ క్రమంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై తాజాగా పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో చంద్రబాబు మానసిక పరిస్థితి పై సీదిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేయడంతో పాటు ఓ వైద్యుడిగా ఆ విషయాన్ని తాను ధ్రువీకరిస్తానన్నారు. చంద్రబాబును ఆస్పత్రికి పంపి మానసిక పరిస్థితి బాగైన తర్వాత అసెంబ్లీలోకి అనుమతిస్తే సరిపోతుందని ఆయన చెప్పారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారినప్పటికీ ప్రతిపక్ష టీడీపీ సైలెంట్ గానే ఉంది.
ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో పాత విషయాలన్నీ బయటకు తీస్తున్నారు నేతలు. చంద్రబాబుపై సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు టీడీపీ నేతలు. ఆయనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే శిరీష, పలువురు టీడీపీ నేతలు.. మాజీ మంత్రి అప్పలరాజుపై ఫిర్యాదు ఇచ్చారు. ప్రజా సమస్యలు చర్చించే శాసనసభలో అప్పలరాజు నోరు పారేసుకున్నారని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే శిరీష అన్నారు.